హైదరాబాద్, జనవరి 24 (నమస్తే తెలంగాణ): వినియోగదారులు వెచ్చించే ప్రతి పైసా సద్వినియోగం చేసేలా వినియోగదారుల వ్యవహారాల శాఖ సిబ్బంది కృషిచేస్తున్నారని ఆ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. నాణ్యమైన ఉత్పత్తులను, సేవల్ని పొందడం పౌరుల హక్కు అని, అందుకు అధికారులు చర్యలు తీసుకొంటున్నారని చెప్పారు. 1986 భారత వినియోగదారుల చట్టాన్ని సవరించి రూపొందించిన వినియోగదారుల చట్టం-2019 ద్వారా వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందుతున్నాయని తెలిపారు. సోమవారం వినియోగదారుల చట్టం-2019పై వినియోగదారుల వ్యవహారాలశాఖ రూపొందించిన ప్రసార ప్రకటనలను మంత్రుల నివాస సముదాయంలో మంత్రి గంగుల కమలాకర్ విడుదల చేశారు. సేవల్లో లోపాలు గమనిస్తే, ఇబ్బందులు ఏర్పడితే శాఖ అధికారులను సంప్రదించాలని వినియోగదారులకు మంత్రి సూచించారు. ప్రచార చిత్రాలు ఇందుకు మరింత దోహదం చేస్తాయని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పౌరసరఫరాలశాఖ కమిషనర్ వీ అనిల్‌కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.