రంగారెడ్డి : యాచారం మండలం కుర్మిద్దలో ఓ కొండచిలువ కలకలం సృష్టించింది. పొలంలో ఉన్న హైటెన్షన్ విద్యుత్ స్తంభం ద్వారా కొండచిలువ తీగల పైకెక్కింది. తీగలను పెనవేసుకున్న కొండ చిలువను చూసి రైతులు ఆశ్చర్యానికి గురయ్యారు. రైతులు అటవీశాఖ, విద్యుత్ శాఖల అధికారులకు సమాచారం అందించారు.
విద్యుత్ సరఫరాకు ఇబ్బంది కలగకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. హైటెన్షన్ వైర్లు కావటంతో ప్రత్యేక జాగ్రత్తలతో తాళ్ల సాయంతో కొండచిలువను కిందపడేశారు. సమీపంలోని అటవీప్రాంతం నుంచి పొలాల్లోకి వచ్చి.. హైటెన్షన్ వైర్లపైకి పాకుతూ వెళ్లినట్లు అటవీశాఖ సిబ్బంది నిర్ధారించారు. కిందపడ్డ కొండచిలువను సిబ్బంది అటవీప్రాంతంలో విడిచిపెట్టేందుకు తీసుకువెళ్లారు.