హైదరాబాద్, మార్చి 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా సర్కారు స్కూళ్ల ముఖచిత్రాన్ని సమూలంగా మార్చే ప్రతిష్ఠాత్మక ‘మన ఊరు-మన బడి, మన బస్తీ-మన బడి’ పథకానికి మంగళవారం అంకురార్పణ జరుగనున్నది. వనపర్తి వేదికగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. స్థానిక జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన పైలాన్‌ను ఆవిష్కరించనున్నారు. మూడేండ్లలో మూడువిడతల్లో ఈ పథకం ద్వారా రూ.7,289.54 కోట్లతో 26 వేల పైచిలుకు ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తారు. తొలివిడతలో 2021-22 విద్యాసంవత్సరంలో రూ.3,497.62 కోట్ల వ్యయంతో 9,123 స్కూళ్లల్లో 12 రకాల వసతులు కల్పిస్తారు. వచ్చే జూన్ కల్లా తొలివిడత పనులను పూర్తిచేయాలని విద్యాశాఖ అధికారులు గడువుగా పెట్టుకున్నారు.
ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలు ఇప్పటికే విడుదలయ్యా యి. క్షేత్రస్థాయి అనుభవాలను దృష్టిలో ఉంచుకొన్న అధికారులు.. స్వల్ప మార్పులు చేశారు. జిల్లాస్థాయిలో సీఎస్ఆర్, దాతల నుంచి నిధుల సమీకరణకు జిల్లా కలెక్టర్లు ప్రత్యేక బ్యాంకు ఖాతా తెరువాల్సి ఉండగా.. తాజాగా ఇదే తరహాలో రాష్ట్రస్థాయిలోనూ బ్యాంకు ఖాతాను తెరువాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో చేపట్టే పనులకు డబ్బుల చెల్లించే చెక్కులపై సంతకాలు చేసే అధికారాన్ని ఇద్దరికే పరిమితం చేశారు. గతంలో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్, హెచ్ఎం, ఏఈ, సర్పంచ్ మొత్తం నలుగురు సంతకాలు చేయాల్సి ఉండగా.. తాజాగా ఎస్ఎంసీ చైర్మన్, హెచ్ఎంకు మాత్రమే ఈ అధికారాన్ని కట్టబెట్టారు.