తాండూర్ : గిరిజనులతో సున్నితంగా వ్యవహరిస్తూ వారి సమస్యలను అర్థం చేసుకుని పోలీస్ శాఖ పట్ల విశ్వాసాన్ని పెంపొందించాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ( CP Amber Kishore Jha ) సూచించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా తాండూర్ సర్కిల్ మాదారం పోలీస్ స్టేషన్‌ను గురువారం తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్‌కు మంచిర్యాల జోన్ డీసీపీ ఎగ్గడి భాస్కర్( DCP Eggadi Bhasker ) , బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్, తాండూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ దేవయ్య, ఎస్సై సౌజన్య పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. అనంతరం సాయుధ దళ పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. స్టేషన్ పరిసరాలు, వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న వాహనాలు, పోలీస్ స్టేషన్ ఆవరణలోని క్రీడా ప్రాంగణం, పోలీస్ వాహనాల నిర్వహణను పరిశీలించారు.

ప్రతి పోలీస్ వాహనంలో ఫస్ట్ ఎయిడ్ కిట్, డ్రాగన్ లైట్, తాళ్లు, ట్రాఫిక్ కోన్స్, క్రైమ్ ప్రొటెక్షన్ రిబ్బన్, రైట్ గేర్ కిట్ తప్పనిసరిగా ఉండాలని సూచించారు. స్టేషన్‌కు సంబంధించిన రికార్డులు, రౌడీషీటర్లు, అనుమానితుల వివరాలను పరిశీలించారు. సీపీ మాట్లాడుతూ ప్రజలకు మరింత స్నేహపూర్వకంగా, అందుబాటులో ఉండే పోలీసింగ్ అందించాలని ఆదేశించారు. పోలీస్ శాఖలో అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతిక సేవలు, సీసీటీఎన్ ఎస్, హాక్ ఐ, టీఎస్ కాప్ వంటి యాప్‌లను సమర్థవంతంగా వినియోగించాలని సూచించారు.
గంజాయి, ఇతర మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులు,యువత, తల్లిదండ్రులు, ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. భారీ వర్షాలు, ప్రకృతి వైపరీత్యాలు వంటి అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేలా ముందస్తు కార్యాచరణ ప్రణాళిక సిద్ధంగా ఉంచాలని అధికారులకు సూచించారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో సీపీ పోలీస్ అధికారులతో కలిసి మొక్కలు నాటారు.