కరీంనగర్ నగరపాలక సంస్థ అధికారుల ప్రణాళికా లోపం వల్ల రూ.కోట్లాది నిధులు వృథాగా మారుతున్నాయి. పలు ప్రాంతాల్లో చెత్త సేకరణ కోసం ఏర్పాటు చేసిన అండర్ గ్రౌండ్ డంపర్ బిన్స్‌ను వినియోగించడంలో నిర్లక్ష్యం వహిస్తుండడంతో అవి ఎందుకూ పనికిరాకుండా పోతున్నాయి. దీంతో ఆయాచోట్ల చెత్త పేరుకుపోయి ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
కరీంనగర్ కార్పొరేషన్, జూలై 24 : కరీంనగర్‌ను చెత్త రహిత నగరంగా మార్చాలని పలు ప్రాంతాల్లో ఉన్న చెత్తను పోగు చేసే డంపర్ బిన్స్ స్థానాల్లో అండర్ గ్రౌండ్ డంపర్ బిన్స్ ఏర్పాటు చేయాలని మూడేళ్ల కిందట అప్పటి పాలకవర్గం నిర్ణయించింది. అందులో భాగంగా స్మార్ట్‌సిటీ నిధుల నుంచి సుమారు రూ.3 కోట్లతో పది ప్రాంతాల్లో రెండు చొప్పున 20 బిన్స్ ఏర్పాటు చేయడంతోపాటు వీటి నుంచి చెత్త సేకరణ కోసం ప్రత్యేకంగా కంప్యాటర్ వాహనాన్ని కొనుగోలు చేశారు. ఈ పనులను టెండర్ ద్వారా ఓ సంస్థకు అప్పగించారు. బిన్స్ ఏర్పాటు చేయడంతోపాటు సెన్సార్ సిస్టంను బిగించాల్సి ఉంది. ఈ సిస్టం ద్వారా బిన్స్ పూర్తిగా నిండిన వెంటనే ఎవరి ప్రమేయం లేకుండా కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు సమాచారం వెళ్తుం ది. అయితే, ఈ బిన్స్‌ను కేవలం 8 ప్రాంతాల్లో ఏర్పాటు చేసినా.. వీటికి ఎక్కడా సెన్సార్ సిస్టం సె ట్ చేయలేదు. కానీ, సంబంధిత కాంట్రాక్టు సంస ్థకు మాత్రం పూర్తి బిల్లులు చెల్లించినట్టు తెలిసింది.
మూడేళ్ల కిత్రం ఏర్పాటు చేసిన అండర్ గ్రౌండ్ డంపర్ బిన్స్‌ను వినియోగించకపోవడంతో అవి మూలకు పడ్డాయి. ప్రస్తుతం చైతన్యపురి, సప్తగిరికాలనీల్లోని బిన్స్‌లలో నిండిన చెత్తను మాత్రమే తొలగిస్తున్నా.. మిగతా ఆరు ప్రాంతాల్లో అసలు వినియోగించడమే లేదు. రూ.3 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు ఎందుకూ పనిరాకుండా పోయింది. ఈ బిన్స్‌ను ఎప్పటికప్పుడు క్లీన్ చేసేందుకు సెన్సార్ సిస్టం ఏర్పాటు చేయకపోవడం వల్లే సమస్యలు ఎదురవుతున్నట్టు తెలుస్తున్నది. ఈ బిన్స్‌ను వినియోగించిన ఆరంభంలో కంప్యాటర్ వాహనం ద్వారా వీటిలోని చెత్తను తొలగించారు. అయితే, రోజులో ఒక్కసారి మాత్రమే తొలగించడంతో ఈ బిన్స్ నిండిపోయి చుట్టు పక్కల ప్రాంతాల్లో అధ్వాన పరిస్థితులు ఏర్పడ్డాయి. సెన్సార్ సిస్టం లేకపోవడంతో ఈ బిన్స్‌ను పక్కన పెడుతున్నారు. దీంతో చెత్త సేకరణ పూర్తిగా ఆటోలు, ట్రాక్టర్ల ద్వారానే చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికార యంత్రాగం దృష్టి సారించి తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నగరవాసులు డిమాండ్ చేస్తున్నారు.