కామారెడ్డి,జూలై 24 : నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఢిల్లీలో పార్లమెంట్ మార్చ్ సందర్భంగా విద్యార్థులపై నిరంకుశదాడికి నిరసనగా, నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం చేపట్టిన విద్యాసంస్థల బంద్ విజయవంతమైంది. ఈ సందర్భంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దిష్టిబొమ్మను దహనం చేశారు.
అనంతరం వారు మాట్లాడుతూ.. నీట్ పేపర్ లీకేజీతో డాక్టర్లు కావాలనుకున్న విద్యార్థులు తమ కల నెరవేకుండానే 21 మంది ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. కేంద్ర ప్రభుత్వం ఏ మాత్రం సిగ్గు లేకుం డా ప్రవర్తిస్తున్నదని మండిపడ్డారు. పైగాఅడిగిన వాళ్లను దేశ ద్రోహులని, అర్బన్ నక్సలైట్లని అనడం సిగ్గుచేటని పేర్కొన్నారు. చనిపోయిన విద్యార్థులకు న్యాయం చేయాలని, నష్టపరిహారం కింద కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు అరుణ్, విఠల్, సురేశ్, భరత్, శివప్రసాద్, జబ్బర్ నాయక్, వినయ్, వినోద్ నాయక్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.