భీమదేవరపల్లి, జూన్ 27: భారత మాజీ ప్రధాని దివంగత పీవీ నరసింహారావు (PV Narasimha Rao) జయంతి నేడు. భారతరత్న పీవీ బహుముఖ ప్రజ్ఞాశాలి. నూతన ఆర్థిక సంస్కరణల సృష్టికర్త. మౌనమునిగా పేరుగాంచిన పీవీ నరసింహారావు భారత జాతి ఖ్యాతిని ప్రపంచ దేశాలకు చాటి చెప్పాడు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక పీవీ నరసింహారావు జయంతి, వర్ధంతి కార్యక్రమాలను ప్రభుత్వం అధికారికంగా చేపడుతుంది. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని వంగర పీవీ స్వగ్రామం. పీవీ ఇంటిని అతని కుటుంబ సభ్యులు పీవీ మ్యూజయంగా మార్చారు. పీవీ వాడిన వస్తువులు, జ్ఞాపకాలు, ఫోటోలను మ్యూజియంలో పదిల పరిచారు. వంగరలో పీవీ స్మారకంగా ఏర్పాటు చేస్తున్న జ్ఞాన వేదిక నిర్మాణ పనులను ఎప్పటికప్పుడు జిల్లా యంత్రాంగం పర్యవేక్షిస్తుంది.
పీవీ ప్రొఫైల్
వరంగల్ జిల్లా (ప్రస్తుత హనుమకొండ జిల్లా) వేలేరు మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యాభ్యాసం మొదలుపెట్టారు. హనుమకొండలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మెట్రిక్యులేషన్ పూర్తి చేశారు. కళాశాల చదువు కోసం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చేరారు. అక్కడ వందేమాతరం గీతం ఆలపించడంతో సహచరులతో పాటు పీవీని విశ్వవిద్యాలయం నుంచి అప్పటి నిజాం ప్రభుత్వం బహిష్కరించింది. దీంతో మహారాష్ట్రలోని నాగపూర్ లో ఉన్నత విద్యాభ్యాసం కొనసాగించారు. మొత్తానికి బీఎస్సీ, ఎల్ఎల్ బీ పూర్తి చేశారు.
విద్యార్థి దశ నుంచే పీవీ నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. కొంతకాలం అజ్ఞాతవాసంలో ఉండి చాందా క్యాంపులో క్రియాశీలక పాత్ర పోషించారు. హైదరాబాద్ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు వద్ద జూనియర్ న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. అనంతరం ఊహించని పరిణామాలు చోటు చేసుకోవడంతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అంచలంచెలుగా ఎదిగి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడయ్యారు.
పీవీ తన సన్నిహితుడు పాములపర్తి సదాశివరావుతో కలిసి 1944లో కాకతీయ పత్రికను వరంగల్ జిల్లాలో స్థాపించారు. 1946 -1955 వరకు వార పత్రికను కొనసాగించారు. ఇందులో గొల్ల రామవ్వ కథ, నీలిరంగు పట్టుచీర, మంగయ్య జీవితం లాంటి రచనలు అప్పటి సామాజిక జీవనానికి అద్దం పట్టాయి. పీవీ రచించిన ‘ఆర్తగీతికలు’ కాకతీయ పత్రికలో ప్రచురితమయ్యాయి. పీవీ రాసిన తన ఆత్మకథ ‘లోపలి మనిషి’లో భారత దేశ చరిత్ర, హైదరాబాద్ సంస్థానంలోని విశిష్టమైన అంశాలను, జరిగిన పరిణామాలను గూర్చి ప్రచురించబడింది.
పీవీ బహుభాషా కోవిదుడు. నిజాం కాలంలో చదువుకున్న వారికి తెలుగు, హిందీ, ఇంగ్లీషు, ఉర్దూ భాషల్లో సహజంగా ప్రావీణ్యం ఉంటుంది. పీవీకి మాత్రం 17 భాషల్లో ప్రావీణ్యం ఉంది. తెలుగు, మరాఠీ, హిందీ, ఇంగ్లీషు, తమిళం, ఫ్రెంచ్ భాషల్లో ప్రావీణ్యం ఉందని చెబుతారు. మరాఠీ నవలలను తెలుగులోకి, తెలుగు గ్రంథాలను హిందీ లోకి అనువాదం చేశారు. కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ రచించిన ‘వేయి పడగలు’ పుస్తకాన్ని సహస్ర ఫన్ (Sahasra Phan) పేరుతో హిందీలోకి అనువాదం చేశారు. హరి నారాయణ ఆప్టే మరాఠీ ప్రసిద్ధ నవల ‘పాన్ లక్షత్ కోన్ ఘేటా’ను అభయ జీవితం పేరుతో తెలుగులోకి పీవీ అనువదించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 1972 ఆగస్టు 15వ తేదీన శాసనసభలో ‘ఆ నిద్రాణ నిశీధిని మానిసి మేల్కొంచినాడు’ అని తన సందేశాన్ని కవితా గానం చేశాడు.
పీవీ సీఎం హోదాలో అర్ధరాత్రి ఉద్వేగభరితంగా శాసనసభలో ఆలపించిన గీతం
సమైక్య రాష్ట్రానికి పీవీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో భారత స్వాతంత్ర్య రజతోత్సవాలు జరిగాయి. ఈ సందర్భంగా అర్ధరాత్రి జరిగిన శాసనసభలో పీవీ ఉద్వేగ భరితంగా గీతాన్ని ఆలపించారు. “ఈ నిద్రాణ నిశీధి మహిత జాగృతి పుం జముగ వెలుగుటే నా తపస్సు, వెలిగించుట నా ప్రతిజ్ఞ..! అనడంతో అధికార ప్రతిపక్ష పార్టీల చప్పట్లు సభ మారుమోగింది.
రాజకీయాల్లో అపర చాణక్యుడిగా పీవీకి మంచి పేరుంది. ఏ పదవిని చేపట్టిన అది ప్రజల పక్షంగానే నడిచింది. 1951లో అఖిల భారత కాంగ్రెస్ సభ్యుడిగా మొదలుకొని దేశ ప్రధాని వరకు ఆయన ప్రజల మనిషిగానే పనిచేశారు. ఇందిరా గాంధీకి అత్యంత నమ్మకస్తుడిగా ఉన్నారు. ఎమర్జెన్సీ తరువాత దేశమంతా కాంగ్రెస్ ఓడిపోయిన ఆంధ్రప్రదేశ్ లో మాత్రం కాంగ్రెస్ జెండాను రెప రెపలాడించారు. ఉమ్మడి రాష్ట్రంలో 42 ఎంపీ స్థానాలు ఉంటే 41 స్థానాలు కాంగ్రెస్ కు రావడం వెనుక పీవీ పాత్ర కీలకం అని చెబుతారు. ఇందిరాగాంధీ ప్రభుత్వ హయాంలో అతని బహుముఖ ప్రతిభ సామర్థ్యాన్ని అంతర్జాతీయ దౌత్యానికి ఉపయోగించారు. 1981లో అలీన దేశాల విదేశాంగ మంత్రుల మహాసభకు పీవీ అధ్యక్షత వహించారు. అంతర్జాతీయ వ్యవహారాల్లో క్రియాశీలక పాత్ర పోషించారు. పీవీకి రాని భాష లేదు.. తెలియని విద్య లేదు.. సుమారు 17 భాషల వరకు అనర్గళంగా మాట్లాడగల దిట్ట పీవీ. కవి, రచయిత, అనువాదకుడు, కథకుడు, పాత్రికేయుడిగా ఆయన చేసిన సేవలు వెలకట్టలేనివి. తనకు వారసత్వంగా సంక్రమించిన భూమిని పేదలకు పంచిన త్యాగశీలి మన పీవీ.
1997 తర్వాత సొంత పార్టీ నుంచే పీవీకి అనేక అవమానాలు ఎదురయ్యాయి. సొంత పార్టీ నేతల నుంచి ఎన్నో ఇబ్బందులను భరించారు. చివరకు జీవిత చరమాంకంలో కోర్టుల చుట్టూ తిరగాల్సి వచ్చింది. అయినా అతని ముందు ఏ కేసు నిలబడలేదు.
కాగా , హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని వంగరలో పీవీ జయంతి వేడుకలు జరుగుతాయని అతని తమ్ముడి కుమారుడు పీవీ మదన్ మోహన్ రావు తెలిపారు. పీవీ అభిమానులు హాజరు కావాలని కోరారు.