హైదరాబాద్, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ) : భారత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు ఆర్థిక, భూ సంస్కరణల వంటివి అనేకం తీసుకొచ్చి వాటి ఫలాలు దేశ ప్రజలకు అందించిన గొప్ప పితామహుడు అని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి కొనియాడారు. మంగళవారం తెలంగాణ భవన్లో పీవీ నర్సింహారావు 21 వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మధుసూదనాచారి మాట్లాడుతూ.. పీవీ పుట్టిన గడ్డమీద పుట్టడం మనందరి అదృష్టమని పేర్కొన్నారు. పీవీ గొప్ప రాజనీతిజ్ఞుడు అని, ఆయన తన జీవితమంతా సంస్కరణలకే అంకితం చేశారని గుర్తుచేశారు.
తెలంగాణలో మొదటి ఆశ్రమ పాఠశాల పెట్టిన మహానుభావుడు ఆయనే అని పునరుద్ఘాటించారు. ఆయన చేపట్టిన ఏ పదవికైనా వన్నె తెచ్చారని కొనియాడారు. పీవీకి పదవులు ముఖ్యం కాదు అని, దేశం, ప్రజలు, వారి ప్రయోజనాలే ముఖ్యమని పేర్కొన్నారు. పీవీ ముఖ్యమంత్రిగా, పలుశాఖలకు మంత్రులుగా, ప్రధానిగా పనిచేసి ఆయా పదవులకు వన్నె తెచ్చాడని కొనియాడారు. పీవీ ఆదర్శాలను పుణికిపుచ్చుకున్న మాజీ సీఎం కేసీఆర్, అదేస్థాయిలో పదేండ్లలోనే తెలంగాణను 70 ఏండ్లపాటు అభివృద్ధి జరిగిన రాష్ర్టాల సరసన నిలబెట్టారని కొనియాడారు.
భారత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు రాజకీయంగా ఎదగాలనుకునే వారికి ఆదర్శమని ఎమ్మెల్సీ సురభి వాణీదేవి అభిప్రాయపడ్డారు. పీవీకి నివాళులర్పించిన అనంతరం ఆమె మాట్లాడుతూ.. దేశానికి తరతరాలుగా పనికొచ్చే సంస్కరణలు తీసుకొచ్చిన గొప్ప మేధావి అని గుర్తుచేశారు. ఈ సందర్భంగా దేశానికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. ఉద్యోగుల సంఘం జేఏసీ మాజీ చైర్మన్ దేవీప్రసాద్ మాట్లాడుతూ.. భారతరత్న, తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నర్సింహారావు సంస్కరణలు దేశాన్ని గట్టెక్కించాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్‌రెడ్డి, ఎన్ఆర్ఐ నేత మహేశ్ బిగాల, షకీలారెడ్డి తదితరులు పాల్గొన్నారు.