హైదరాబాద్, జనవరి 21 (నమస్తే తెలంగాణ): టీజీఎస్ ఆర్టీసీ ప్రైవేటీకరణకు రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు రహస్య ఎజెండాతో ముందుకు వెళ్తున్నదని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ విమర్శించారు. తెలంగాణ భవన్లో మంగళవారం ఎమ్మెల్సీ శేరి సుభాశ్‌రెడ్డి, రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ చిరుమిళ్ల రాకేశ్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఆర్టీసీ పాత బస్సుల స్థానంలో ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సులను తెచ్చి డిపోలను ప్రైవేకరిస్తున్నదని మండిపడ్డారు. 100 రోజుల్లోనే విలీనం చేస్తామని హామీ ఇచ్చి 400 రోజులైనా కాంగ్రెస్ సర్కార్ పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. నూతన నియామకాలు చేపట్టకుండా, కొత్త బస్సులను కొనకుండా ఆర్టీసీ నిర్వీర్యానికి కుట్ర చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎలక్ట్రిక్ బస్సులను అద్దెకు ఇస్తున్న ఢిల్లీ జేబీఎం అనే ప్రైవేటు సంస్థకు వరంగల్, హైదరాబాద్-1 డిపోలను అప్పగించారని, డిపోలో పనిచేస్తున్న సిబ్బందిని ఇతర డిపోలకు పంపిస్తున్నారని విమర్శించారు. త్వరలోనే కరీంనగర్, నిజామాబాద్, నల్లగొండ, సూర్యాపేటతోపాటు మరికొన్ని డిపోలను కూడా జేబీఎంకు అప్పగించేలా ప్లాన్ చేస్తున్నారని తెలిపారు.
బీఆర్ఎస్ హయాంలో 1,150 కొత్త బస్సులు
బీఆర్ఎస్ హయాంలో రెండు విడతలుగా కొనుగోలు చేసిన 500 ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ బస్సులను (ఏసీ, నాన్ ఏసీ) ఎయిర్‌పోర్టుతోపాటు వివిధ జిల్లాలకు నడిపించామని వివరించారు. 650 డీజిల్ బస్సులను ఆర్టీసీ కొనుగోలు చేసిందని, లగ్జరీ, సెమీ లగ్జరీ బస్సు సర్వీసులుగా నడిపించామని గుర్తుచేశారు. ఆనాడు ఆర్టీసీ నష్టాలను నివారించగలిగామని గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చాక ఒక్క బస్సుకు ఆర్డర్ ఇవ్వని రేవంత్‌రెడ్డి సర్కారు.. తమ హయాంలో కొనుగోలు చేసిన బస్సులకు జెండాలు ఊపి ప్రారంభించారని తెలిపారు. ప్రైవేటీకరణ కోసమే నియామకాలు చేపట్టడం లేదని తెలిపారు. ఈ దశలో ఆర్టీసీ పరిరక్షణకు కార్మిక సంఘాలతో కలిసి బీఆర్ఎస్ పోరాడుతుందని స్పష్టం చేశారు. ఏడాదిగా ఆర్టీసీని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో ఆర్టీసీకి ఎలా లాభాలు వచ్చాయో ప్రభుత్వం చెప్పడమే లేదని విమర్శించారు.
ఆర్టీసీ ఆస్తులను అమ్మేందుకే: శేరి సుభాశ్‌రెడ్డి
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న విలువైన ఆర్టీసీ స్థలాలను అమ్మేసేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రైవేటీకరణ బాట పట్టిందని ఎమ్మెల్సీ శేరి సుభాశ్‌రెడ్డి విమర్శించారు. ఒక ఆర్టీసీ బస్సుకు ఆరుగురు సిబ్బంది ఉంటారని, ఎలక్ట్రిక్ బస్సులను అద్దెకు తీసుకోవడం వల్ల ఒక్క కండక్టర్ మాత్రమే సంస్థ కింద పరిగణించాలని చూస్తున్నారని మండిపడ్డారు. ప్రైవేటు బస్సుల వల్ల ఉద్యోగుల భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదమున్నదని మండిపడ్డారు.