రామగిరి, ఫిబ్రవరి 01 : ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్కు సిట్ నోటీస్ జారీ చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా విమర్శించారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఈ నోటీసులు ఇచ్చారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని వారు తెలిపారు. ఇందుకు నిరసనగా ఆదివారం పెద్దపల్లి జిల్లా మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ ఆధ్వర్యంలో బేగంపేట ఎక్స్ రోడ్ నుంచి సెంటినరీకాలనీ, కల్వచర్ల వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పుట్ట మధుకర్ మాట్లాడారు.
ప్రజలిచ్చిన ప్రజాస్వామ్య మాండేట్ను గౌరవించకుండా, ప్రతిపక్ష నేతలను లక్ష్యంగా చేసుకుని దర్యాప్తుల పేరుతో వేధింపులకు పాల్పడటం సరికాదని అన్నారు. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని వ్యాఖ్యానించారు. ఫోన్ ట్యాపింగ్ అంశంపై నిష్పక్షపాతంగా, పారదర్శకంగా విచారణ జరగాలని, రాజకీయ ఒత్తిళ్లకు అతీతంగా సిట్ వ్యవహరించాలని డిమాండ్ చేశారు. ప్రజల దృష్టిని అసలు సమస్యల నుంచి మళ్లించేందుకే ఇలాంటి చర్యలు తీసుకుంటున్నారని ఆరోపించారు.