రైతన్నలూ.. సన్న వడ్లు పట్టుకొని పోయి సర్కారుకు అమ్మాలని చూస్తున్నరా? అమ్మితే రూ.500 బోనస్ వస్తదని తెగ ఆశపడుతున్నరా? సన్న వడ్లే తెచ్చారో, లేదో మీరు చెప్తేనో, చూసినోళ్లు చెప్తేనో, కండ్ల ముందు కనిపిస్తేనో సరిపోదండోయ్. సర్కారోళ్లే ఓ బియ్యపు గింజను తీసుకొని దాని పొడవెంత? వెడల్పెంత? అని కొలుస్తరు. వాళ్ల లెక్క సరిపోతేనే మీరు పండించింది సన్న వడ్లేనని సర్టిఫికెట్ ఇస్తరు. కొంచెం పొడవు ఎక్కువైనా, గింజ అడ్డంగా పెరిగినా బోనస్‌పై ఆశ వదులుకోవాల్సిందే!
Bonus | హైదరాబాద్, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ) : సన్న ధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తామంటూ ప్రకటించిన ప్రభుత్వం.. లోలోపల మాత్రం కోతలు పెట్టేందుకు సిద్ధమవుతున్నది. బోనస్‌ను ఎగ్గొట్టేందుకు ‘కొలత’ల పేరుతో కొర్రీలకు రంగం సిద్ధం చేసింది. కొనుగోలు కేంద్రానికి రైతులు తెచ్చిన ధాన్యం సన్నదా? దొడ్డుదా; తేల్చేందుకు పౌరసరఫరాల సంస్థ ప్రత్యేక పరికరాలను కొనుగోలు చేస్తున్నది. ఈ పరికరంతో ధాన్యం కొలతలు వేసి.. నిబంధనల ప్రకారం కొలతలు ఉంటే ఆ ధాన్యాన్ని సన్న ధాన్యంగా పరిగణించనున్నారు. ఆ ధాన్యానికి మాత్రమే రూ.500 బోనస్ ఇవ్వనున్నది. కొలతలో ఏ మాత్రం తేడా వచ్చినా రైతులు తీసుకొచ్చిన ధాన్యం సన్నధాన్యంగా గుర్తించరు. ఆ రైతులకు బోనసూ ఇవ్వరు.
చిన్న చిన్న వస్తువుల పొడవు, వెడల్పు కొలతలు లెక్కించేందుకు వినియోగించే ‘కాలిపర్స్’ పరికరాన్ని సన్నధాన్యాన్ని గుర్తించేందుకు వినియోగించనున్నారు. ఇందుకు సంబంధించి పౌరసరఫరాల సంస్థ ఇప్పటికే భారీ సంఖ్యలో కాలిపర్స్ కొనుగోలుకు నిర్ణయించింది. ప్రతి కొనుగోలు కేంద్రానికి కనీసం రెండు చొప్పున కాలిపర్స్ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ సీజన్లో ధాన్యం కొనుగోలుకు 7 వేలకు పైగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నది. ఈ లెక్కన కనీసంగా 14 వేల కాలిపర్స్ పరికరాలు అవసరం కానున్నాయి. ఇందులో భాగంగానే ప్రస్తుతానికి 10 వేల కాలిపర్స్ సరఫరా చేయాలని మార్కెటింగ్ శాఖను కోరినట్టుగా తెలిసింది. ముందుగా ధాన్యం వచ్చే పలు జిల్లాలకు కాలిపర్స్‌ను అందించినట్టు తెలిసింది.
రైతులు తీసుకొచ్చే ధాన్యంలో సన్నాలేవి? దొడ్డు రకం ఏవి? అనే అంశాన్ని తేల్చేందుకు అధికారులు కొన్ని కొలతలను నిర్ణయించారు. ఇప్పటికే ఆర్డర్ చేసిన కాలిపర్స్‌తో ఈ కొలతను లెక్కిస్తారు. రైతులు తీసుకొచ్చిన ధాన్యాన్ని కాలిపర్స్‌లో పెట్టి ఆ గింజ పొడవు, వెడల్పును లెక్కిస్తారు. ఇందుకోసం రైతు తీసుకొచ్చిన ధాన్యంలో 10 గింజలను సేకరిస్తారు. ఆ ధాన్యాన్ని ఒక ప్రత్యేకమైన పరికరంలో వేసి వాటిపై పొట్టుపోయేలా చేస్తారు. ఆ తర్వాత వచ్చినటువంటి బియ్యపు గింజను కాలిపర్స్ ద్వారా కొలతేస్తారు. ఈ కొలతలో బియ్యపు గింజ పొడవు 6 మిల్లీమీటర్ కన్నా తక్కువగా ఉండాలి. వెడల్పు 2 మిల్లీమీటర్‌కు మించొద్దు. బియ్యపు గింజ పొడవు, వెడల్పు రేషియో 2.5 మిల్లీమీటర్ కన్నా ఎక్కువగా ఉండాలి. కాలిపర్స్‌లో పెట్టిన బియ్యపు గింజ ఈ కొలతలకు సరిపోతేనే దాన్ని సన్నధాన్యంగా పరిగణిస్తారు. లేనిపక్షంలో ఆ ధాన్యాన్ని దొడ్డు రకం ధాన్యంగా పరిగణిస్తారు. ఈ కొలతల నిబంధన ప్రకారం ఉన్నటువంటి ధాన్యానికే రూ.500 బోనస్ ఇవ్వనున్నారు.
సన్నధాన్యానికి మాత్రమే క్వింటాలుకు రూ.500 బోనస్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే మార్కెట్లో చాలా రకాల సన్నాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏ సన్న రకాలకు బోనస్ వర్తిస్తుందో వ్యవసాయశాఖ స్పష్టతనిచ్చింది. ఇందులో భాగంగానే 33 రకాల సన్నాలను గుర్తిస్తూ జూలైలో జాబితాను విడుదల చేసింది. 33 రకాలతో పాటు బీపీటీ 5204, ఆర్ఎన్ఆర్ 15047, హెచ్ఎంటీ సోనా, జైశ్రీరాం రకాలను కూడా సన్నాలుగా పరిగణించాలని సూచించింది. బోనస్ వర్తించే సన్నాల జాబితాను ప్రకటించిన ప్రభుత్వమే.. మళ్లీ ఇప్పుడు ఈ కొలతల తతంగం పెట్టడం ఏమిటి? అని రైతులు ప్రశ్నిస్తున్నారు. సన్నరకాల్లోనే గింజల పొడవు, వెడల్పులో తేడా ఉంటుందని, అలాంటప్పుడు వాటిని సన్నాలుగా గుర్తించకపోవటం ఏమిటి? అని నిలదీస్తున్నారు. రైతులు తీసుకొచ్చిన ధాన్యం రకం వ్యవసాయశాఖ విడుదల చేసిన సన్నాల జాబితాలో ఉన్నా.. కాలిపర్స్ కొలతలో తేడా వస్తే పరిస్థితి ఏమిటి? అన్నది ప్రశ్నగా మారింది.
సన్న ధాన్యాన్ని గుర్తించేందుకు సివిల్ సైప్లె కాలిపర్స్‌తో కొలతలు వేయాలనే నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రైతులకు ఇచ్చిన బోనస్ హామీని ఎగ్గొట్టేందుకే ఈ కుట్రలకు తెరతీసిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సీజన్లో సుమారు 91 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంటుందని ప్రభుత్వం అంచనా వేస్తున్నది. ఇందులో 44 లక్షల టన్నుల దొడ్డు రకాలు కాగా, 47 లక్షల టన్నులు సన్న ధాన్యం ఉంటుందని ఇటీవలి సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఈ లెక్కన 47 లక్షల టన్నుల సన్న ధాన్యం కొనుగోలు చేస్తే క్వింటాలుకు రూ.500 చొప్పున టన్నుకు రూ.5 వేల చొప్పున మొత్తం రూ.2,350 కోట్లు అవసరం అవుతాయి. ఇవి మద్దతు ధరకు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ప్రభుత్వం ఉన్న ఆర్థిక ఇబ్బందుల్లో ఇంత భారీ మొత్తం భారం భరించడం కష్టమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే కొలతల కొర్రీ పెడుతున్నదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎంత వీలైతే అంత కోతలు కోసి బోనస్ భారాన్ని రూ.500 కోట్లకు మించనివ్వొద్దని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిసింది.