(స్పెషల్ టాస్ బ్యూరో) హైదరాబాద్, జనవరి 18 (నమస్తే తెలంగాణ): అబద్ధాలతో అధికారం చేపట్టిన బీజే పీ.. ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో అడ్డదారిలో గద్దెనెక్కాలని కుట్ర చేస్తున్నదని పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ మండిపడ్డారు. ప్రజల ఆదరాభిమానాలు సంపాదిస్తే అధికారం చిరకాలం ఉంటుందని, అడ్డదారిన గద్దె నెకేవారికి ప్రజలు బుద్ధి చెప్తారని అన్నారు. ప్రజలకు కోపమొస్తే నేలకేసి కొడతారని, చరిత్రలో ఇలాంటి ఉదంతాలు కోకొల్లలని చెప్పారు. బీజేపీ ప్రజాగ్రహానికి గురికాక తప్పదని స్పష్టం చేశారు. పలు సామెతలతో భగవంత్ మాన్ ఖమ్మం సభికులను ఆకట్టుకొన్నారు.
కేంద్రంలోని బీజేపీ సర్కారును గద్దె దించే సమయం ఆసన్నమైందని, ఖమ్మం సభ నుంచే అటువైపు అడుగులు పడ్డాయని తెలిపారు. విపక్ష పాలిత రాష్ర్టాల్లో గవర్నర్లను అడ్డం పెట్టుకొని ఆ ప్రభుత్వాలను కేంద్రం ఇబ్బందులు పెడుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లోనూ 250కి 128 సీట్లు ఆప్ దక్కించుకొన్నా, మేయర్ పదవిపై బీజేపీ కన్నేసిందని ఆరోపించారు. ఒకే దేశం, ఒకే చట్టం అంటూ మత రాజకీయాలు చేస్తున్న బీజేపీ.. భారతీయ జుమ్లా పార్టీ అని అభివర్ణించారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని యువతను మోదీ సరారు మోసం చేసిందని విమర్శించారు.