హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): కన్నెపల్లిలో తక్షణమే పంపిగ్ ప్రారంభించి కాళేశ్వరం జలాలను రైతాంగానికి అందించాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేసింది. వందల టీఎంసీల కృష్ణాగోదావరి జలాలు సముద్రం పాలవుతున్నా సర్కారు పట్టించుకోవటం లేదని నిప్పులు చెరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయాల ద్వారా తమను సాధించాలనకుంటే నిరభ్యంతరంగా చేసుకోవచ్చని, అదే సమయంలో రైతాంగాన్ని ఇబ్బందులకు గురిచేస్తామంటే బీఆర్ఎస్ సహించదని తేల్చిచెప్పింది. ఢిల్లీలో సోమవారం మాజీ మంత్రులు జగదీశ్‌రెడ్డి, గంగుల కమలాకర్, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అనుసరిస్తుందని ఎండగట్టారు.
రాష్ట్రంలో 8 నెలలుగా పరిపాలన పడకేసిందని విమర్శించారు. సాగునీటి రంగంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ధ్వజమెత్తారు. గోదావరి, కృష్ణా నదుల నుంచి నీరు వందల టీఎంసీల నీరు వృథాగా సముద్రం పాలవుతున్నా రైతులకు నీరు ఇచ్చేందుకు కాంగ్రెస్ సర్కారుకు మనసు రావడం లేదని ధ్వజమెత్తారు. రాజకీయ కుట్రలో భాగంగా రైతులకు అందాల్సిన అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టుల్లో నీటిని ప్రభుత్వం దుర్మార్గంగా ఖాళీ చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు శ్రీశైలం, నాగార్జునసాగర్‌కు నీళ్లు ఉన్నాయనే సమాచారం తమకు ఉన్నదని, ఉన్న నీటిని సద్వినియోగం చేసుకునే సోయి కాంగ్రెస్ సర్కార్‌కు లేదని మండిపడ్డారు. మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో వర్షాభావం కారణంగా కరవు పరిస్థితులు కనిపిపిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. నాగార్జునసాగర్ ఎడమ కాలువకు నీటిని విడుదల చేసి అన్ని రిజర్వాయర్లు, చెరువులు నింపాలని డిమాండ్ చేశారు.
రైతుల నోట్లో మట్టి కొడుతున్న కాంగ్రెస్: గంగుల
కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల నోట్లో మట్టికొడుతున్నదని మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఆరోపించారు. ఇటీవల బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధుల బృందం కాళేశ్వరం ప్రాజెక్టు పర్యటకు వెళ్లిన తరువాత నీటిని విడుదల చేసిందని ఆ తరువాత ఆపేసిందని మండిపడ్డారు. మిడ్‌మానేర్, ఎల్లంపల్లి, ఎల్ఎండీ ప్రాజెక్టులను కాంగ్రెస్ సర్కార్ కావాలనే ఎండబెట్టిందని ఆరోపించారు. ఇన్‌ఫ్లో ఉన్నా కన్నేపల్లి పంపింగ్ చేయడం లేదని పేర్కొన్నారు. ఎన్డీఎస్ఏ పేరు చెప్పి ప్రభుత్వం తప్పించుకోవాలని చూస్తున్నదని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఎస్ఏకు ప్రస్తుత పరిస్థితిని వివరించిందా? ఒకవేళ ఉంటే ఎన్‌డీఎస్‌కు పంపిన నివేదికను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. కన్నేపల్లి నుంచి లిఫ్ట్ చేయ డానికి సమస్య ఏమిటని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం భేషజాలకు పోకుండా నీటిని విడుదల చేయాలని హితవు పలికారు.
భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి: కొత్త ప్రభాకర్‌రెడ్డి
రైతులను కేసీఆర్ కన్నబిడ్డలుగా కడుపులో పెట్టుకొని చూసుకుంటే కాంగ్రెస్ సర్కార్ రైతాంగాన్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నదని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. రంగనాయక్‌సాగర్, అనంతసాగర్, కొండపోచమ్మ సాగర్ నింపి హల్దీవాగు, కూడవెల్లివాగులో కేసీఆర్ గోదావరి నీటితో నింపి గజ్వేల్, నర్సాపూర్, దుబ్బాక, మెదక్ నియోజకవర్గాలోని రైతాంగానికి నీటి కష్టాలు లేకుండా చేశారని గుర్తుచేశారు.
అనర్హత వేటు పడేదాకా పోరాటం
బీఆర్ఎస్ టికెట్‌పై గెలిచి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై న్యాయకోవిదులు, రాజ్యాంగ నిపుణులతో చర్చించామని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. చట్టానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేశారు. పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని తెచ్చిన కాంగ్రెస్ పార్టీయే ఆ చట్టానికి తూట్లు పొడుస్తున్నదని మండిపడ్డారు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ రాష్ర్టానికో విధానం అన్నట్టుగా వ్యవహరించడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ వైఖరిని ప్రజల్లో ఎండగడతామని హెచ్చరించారు. న్యాయస్థానాలపై తమకు నమ్మకం ఉన్నదని, హైకోర్టు తీర్పు కోసం వేచి చూస్తున్నామని పేర్కొన్నారు.