హనుమకొండ చౌరస్తా, ఫిబ్రవరి 2: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్ సామాన్యుడి ఆశలను నీరుగార్చిందని అఖిల భారత విశ్వవిద్యాలయాల ఉద్యోగుల సమాఖ్య, జాతీయ ఉపాధ్యక్షుడు డాక్టర్ పుల్లా శ్రీనివాస్ తీవ్రంగా విమర్శించారు. ఈ బడ్జెట్ పూర్తిగా కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేసే విధంగా ఉందని, సామాన్యప్రజలు, ఉద్యోగులు, కార్మికులు, నిరుద్యోగులు, పేద వర్గాలను విస్మరించిందని ఆయన ధ్వజమెత్తారు. కాకతీయ యూనివర్సిటీలోని టెక్నికల్ అసోసియేషన్ కార్యాలయంలో సోమవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (ఎన్ఈపీ) ప్రకారం జీడీపీలో 6 శాతం నిధులు విద్యకు కేటాయించాల్సి ఉండగా, ఈ బడ్జెట్లో ఆ ఊసే లేదని, కేటాయించిన 1.39 లక్షల కోట్లు ఏ మూలకూ సరిపోవన్నారు.
పైగా ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీపై ఎలాంటి ఆంక్షలు లేకపోవడం దారుణమన్నారు. ఆరోగ్య రంగానికి 1.06 లక్షల కోట్లు కేటాయించినా, నియంత్రణలేని ప్రైవేట్ హాస్పిటల్స్ వలన పేదలకు వైద్యం భారంగా మారిందని, వీటిని అరికట్టే చట్టపరమైన నిబంధనలు బడ్జెట్లో లేవన్నారు. దేశంలో లక్షలాది ప్రభుత్వ ఖాళీలను భర్తీ చేయడంపై స్పష్టత లేదన్నారు. 8వ వేతన సంఘం రిపోర్ట్, పాత పెన్షన్ (ఓపీఎస్) పునరుద్ధరణ, ఆదాయం పన్ను పరిమితి పెంచటం వంటి ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం గాలికొదిలేసిందని, కార్మిక చట్టాల సవరణ ద్వారా హక్కులను హరించి, ఈ బడ్జెట్ పూర్తిగా ‘యాంటీ వర్కర్ – యాంటీ ఎంప్లాయీ’ ధోరణిలో రూపొందించబడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిర్మల సీతారామన్ ప్రసంగంలో దేశాభివృద్ధి మాటలు బాగున్నా, వాస్తవానికి ఈ బడ్జెట్ పేద, మధ్యతరగతి ప్రజల నడ్డి విరిచేలా ఉందన్నారు. ఇది కేవలం ధనికుల కోసమే రూపొందించబడిందని శ్రీనివాస్ అన్నారు. సమావేశంలో కార్యదర్శి నలుబోల రాము, వి.నందయ్య, మెట్టు రవి, వై.బాబు, వై. రవికుమార్, ప్రేమసాగర్ పాల్గొన్నారు.