హైదరాబాద్, జనవరి 31 (నమస్తే తెలంగాణ): పబ్బుల్లో డ్రగ్స్ వినియోగిస్తున్నట్టు గుర్తిస్తే వాటిని మూసివేయడంతోపాటు, లైసెన్స్‌లు రద్దు చేస్తామని ఎక్సైజ్‌శాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ స్పష్టంచేశారు. పబ్బుల లోపల, వాటి పరిసరాల్లో నిషేధిత మత్తుపదార్థాల వినియోగంపై పూర్తిస్థాయి బాధ్యత యాజమాన్యాలదేనని పేర్కొన్నారు. డ్రగ్స్ వినియోగించేవారిపై క్రిమినల్ చర్యలు తప్పవని, ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని తేల్చిచెప్పారు. డ్రగ్స్ వినియోగిస్తూ పట్టుబడితే ఏ స్థాయివారైనా, చివరకు ప్రజాప్రతినిధులైనా, వారి పిల్లలైనా వదలొద్దని, చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ నుంచి స్పష్టమైన ఆదేశాలున్నాయని పేర్కొన్నారు. సోమవారం హరితప్లాజా హోటల్లో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ జీహెచ్ఎంసీ పరిధిలోని పబ్బుల యాజమాన్యాలతో సమావేశమయ్యారు. డ్రగ్స్ అంశంతోపాటు పబ్బుల నిర్వహణలో నిబంధనలపై యాజమాన్యాలకు మరింత స్పష్టతనిచ్చారు. పబ్బుల యాజమానులు తమ పబ్బుకు వచ్చే వినియోగదారుల ప్రవర్తన, కిందిస్థాయి సిబ్బంది పనితీరుపై కన్నేసి ఉంచాలని సూచించారు. ఎలాంటి అనుమానం ఉన్నా ఎక్సైజ్‌శాఖ టోల్‌ఫ్రీ నంబర్ (18004252523)కు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ నంబర్‌ను అన్ని పబ్బులు, బార్లలో స్పష్టంగా కనిపించేలా విధిగా ఏర్పాటు చేయాలని సూచించారు. సమాచారం ఇచ్చినవారికి ప్రోత్సాహకాలు ఇస్తామని తెలిపారు. సమావేశంతో ఎక్సైజ్‌శాఖ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ ఉన్నతాధికారులు అజయ్‌రావు, హరికిషన్, డేవిడ్ రవికాంత్, చంద్రయ్య, సత్యనారాయణ, అరుణ్‌కుమార్, శ్రీలం శ్రీనివాసరావు, రవీందర్రావు తదితరులు పాల్గొన్నారు.
నైట్రోవిట్ ట్యాబ్లెట్స్ విక్రయ ముఠా పట్టివేత
నిద్రమత్తును కలిగించే నైట్రోవిట్ ట్యాబ్లెట్లను విక్రయిస్తున్న ముఠాను ఎక్సైజ్‌శాఖ టాస్క్‌ఫోర్స్ బృందం ఆదివారం రాత్రి పట్టుకుంది. నగరంలోని మల్లేపల్లి, అత్తాపూర్, గోపన్‌పల్లి ప్రాంతాల్లో టాస్క్‌ఫోర్స్ సిబ్బంది ఆకస్మికంగా తనిఖీలు జరిపి 286 ట్యాబ్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. ట్యాబ్లెట్లు సరఫరా చేస్తున్న కన్యకుమారి, రాజకుమారి, మెడికల్ షాప్ యజమానులు అల్కేశ్ అగర్వాల్, తిరుపతిరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. నయనకుమారి, చక్రధర్ అనే మరో ఇద్దరు పరారీలో ఉన్నారని అధికారులు తెలిపారు.
మార్చి నాటికి నీరా ప్రాజెక్టు పూర్తి:అధికారులను ఆదేశించిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్
నీరా ప్రాజెక్టును మార్చి నెలలో పూర్తి చేసేలా పనులు మరింత వేగవంతం చేయాలని ఎక్సైజ్‌శాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ అధికారులను ఆదేశించారు. టూరిజం ప్లాజా హోటల్లో సోమవారం నీరా ప్రాజెక్టు పనులపై సమీక్ష నిర్వహించారు. నెక్లెస్‌రోడ్డులో నిర్మిస్తున్న నీరాకేఫ్ పనులతోపాటు యాదాద్రి జిల్లాలోని నందనవనంలో ఏర్పాటుచేస్తున్న నీరా అనుబంధ ఉత్పత్తుల తయారీ కేంద్రం పనులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. సమీక్షలో ఎక్సైజ్‌శాఖ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, టూరిజం ఎండీ మనోహర్, ఎక్సైజ్‌శాఖ ఉన్నతాధికారులు అజయ్‌రావు, హరికిషన్, డేవిడ్ రవికాంత్, చంద్రయ్య, సత్యనారాయణ, అరుణ్‌కుమార్, శ్రీలం శ్రీనివాసరావు, రవీందర్రావు పాల్గొన్నారు.