దళితవాడల్లో లొల్లి పుట్టిస్తరా?
75 ఏండ్లుగా దళితులను ఏ ముఖ్యమంత్రీ పట్టించుకోలేదు. ఈ రోజు సీఎం కేసీఆర్ దళితులను పట్టించుకొంటున్నడు. దళితబంధు పెట్టిండు. దళితవాడల్లో వెలుగులు నింపుతున్నడు. మహోన్నత వ్యక్తిపై దుష్ప్రచారం తగదు. దళితబంధు రాదని ప్రచారాలు చేయడం సరికాదు. మీ ప్రయత్నాలేవన్నా ఉంటే చేసుకోండి. విష ప్రచారాలు మానుకోండి. బీజేపీ ఇప్పటివరకు ఏం జేసిందో? ఏం జేత్తదో చెప్పాలే. తిరుగాలే. దళితవాడల్లో లొల్లి పుట్టిస్తరా? అలా చేస్తే ఊరుకోం. అడ్డుకుంటం. జాగ్రత్త.
జమ్మికుంట, ఆగస్టు 25: ‘బీజేపీ కలర్ మారింది. కొత్త కలరేసుకుని వచ్చిన్రు. ఇంటింటికీ తిరుగుతన్రు. నాైల్గెదు కార్లేసుకుని ఊళ్లకత్తే ఊకుంటమా ఏంది? తప్పుడు ప్రచారాలను అడ్డుకుంటం. అడ్డుకున్నం. ఎల్లగొట్టినం’.. హుజూరాబాద్‌లో రంగుమార్చిన బీజేపీ రాజకీయంపై స్థానిక దళితుల్లో పెల్లుబికిన ఆగ్రహం ఇది. తనది ఎర్రరంగు సిద్ధాంతమని చెప్పి.. కాషాయ రంగు పార్టీలో చేరిన ఈటల నీలిరంగు ప్రచార వాహనాలను గ్రామాలకు పంపించడంపై ప్రజలు తీవ్రంగా ఆగ్రహిస్తున్నారు. నీలిరంగు వాహనం.. దానిపై మోదీ సహా బీజేపీ నేతలెవరి ఫొటోలు లేకుండా.. ఫూలే, అంబేద్కర్, జగ్జీవన్‌రాం బొమ్మలతో.. తెల్లరంగు కమలం గుర్తు.. ఈటల బొమ్మతో తయారుచేసిన నాలుగైదు ప్రచార రథాలను ఈటల రాజేందర్ గ్రామాలకు పంపించారు. ఆ రథాలను చూసి దళితబిడ్డలు ఆశ్చర్యపోయారు. దళితబంధు నలుగురైదుగురికే వస్తుందని, మిగతావారికి రాదంటూ అసత్య ప్రచారాలు చేస్తున్న ఈటల అనుచర గణానికి గుణపాఠం చెప్పారు. రంగులు మార్చిన ఈటలపై తిరగబడ్డారు. సున్నితమైన అంశాలపై రెచ్చగొడుతూ.. ఇంటింటా తిరుగుతున్న వ్యక్తులను నిలదీశారు. తప్పుడు ప్రచారాన్ని వెంటనే ఆపాలని, గ్రామం విడిచి వెళ్లిపోవాలని హెచ్చరించారు. నాలుగు కార్లు, ప్రచార రథాన్ని వెనక్కి పంపించారు.
దళితుల్లో చిచ్చు పెడ్తరా? ఇంత దిగజారుడు రాజకీయం చేస్తారా? అంటూ ఫైర్ అయ్యారు. ‘దళిత బాంధవుడు కేసీఆర్’ అంటూ ప్రచార రథం, వాహనాలు వెళ్లేదాకా నినదించారు. ఈ ఘటన బుధవారం సాయంత్రం జమ్మికుంట మండలం శంభునిపల్లి గ్రామంలో జరిగింది.
ఈటల కొత్త ఎత్తుగడ
హుజూరాబాద్‌లో టీఆర్ఎస్కు వస్తున్న ఆదరణతో బెంబేలెత్తిపోయిన ఈటల రాజేందర్ తాజాగా దళితులను రెచ్చగొట్టి సొమ్ము చేసుకొనేందుకు కుయుక్తులు పన్నుతున్నట్టు తేలిపోయింది. బీజేపీ జెండా, ఈటల బొమ్మ ఉంటుంది. కానీ వాహనం మాత్రం నీలిరంగులో ఉంటుంది. ఎక్కడా బీజేపీ రాష్ట్ర, జాతీయ నాయకుల ముఖాలు మచ్చుకు కూడా కనిపించవు. ఈ వాహనాలను బుధవారమే రంగంలోకి దింపారు. బుధవారం సాయంత్రం శంభునిపల్లి గ్రామానికి రంగుమార్చుకొన్న ప్రచార రథాలు చేరుకొన్నాయి. వాడవాడల్లో తిరుగుతూ.. దళితబంధు ఈటల రాజేందర్ వల్లనే వచ్చిందని ప్రచారం మొదలుపెట్టారు. మరోవాడలో నలుగురైదుగురికి మాత్రమే ఇస్తారని.. ఎవ్వరికీ ఇవ్వరంటూ చెప్పారు. ప్రభుత్వంపై తిరగబడాలని రెచ్చగొట్టే యత్నంచేశారు. ఈ తప్పుడు ప్రచారాన్ని దళితులు అడ్డుకొన్నారు. వారికి అండగా శంభునిపల్లి గ్రామ టీఆర్ఎస్ శాఖ అధ్యక్షుడు రాసపెల్లి సదానందం, నాయకులు కొత్తూరి రమేశ్, మారపెల్లి ప్రవీణ్, రాసపెల్లి సంపత్, రాజు, అఖిల్, సిరికొండ రమేశ్, కొత్తూరి సారయ్య నిలిచారు. ఓట్లు అడగండి.. కానీ, రెచ్చగొట్టవద్దని హితవుచెప్పారు. కానీ వాహనాల్లోని వ్యక్తులు తగ్గకపోవడంతో దళితులు ప్రచారానికి అడ్డంగా నిలబడ్డారు. వ్యతిరేక నినాదాలు చేశారు. తాము కూడా దళితులమేనని ఈటల వర్గీయులు చెప్పడానికి ప్రయత్నించారు. దళితులే అయితే చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తారా? వెళ్లకుంటే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. గ్రామస్తులంతా ఒక్కటయ్యారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే సమయంలోనే ఈటల అనుచరులు వాహనాలు సహా జారుకొన్నారు. వాహనాలు వెళ్లుతున్నంతసేపు ‘జై తెలంగాణ.. జై కేసీఆర్.. దళిత బంధువు కేసీఆర్..’అంటూ దళితబిడ్డలు నినాదాలు చేశారు.
ఈటల జమునను నిలదీసిన దళితులు
హుజూరాబాద్‌టౌన్: దళితులకు ఈటల రాజేందర్ ఏం చేసిండని ఆయన తరుఫున ప్రచారానికి వచ్చారంటూ ఈటల భార్య జమునను హుజూరాబాద్ పట్టణంలోని ఇందిరానగర్ దళిత కాలనీకి చెందిన పలువురు నిలదీశారు. 13 వ వార్డులో బుధవారం ప్రచారం చేయడానికి వచ్చిన జమునను స్థానికులు అడ్డుకొన్నారు. మమ్మల్ని ఈటల ఏం ఉద్ధరించిండు.. ఇన్నేళ్లు ఎమ్మెల్యేగా ఉండి ఏం చేసిండని ప్రశ్నలు గుప్పించారు. కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. పట్టణ సీఐ వీ శ్రీనివాస్ సిబ్బందితో అక్కడికి చేరుకొని పరిస్థితిని చక్కబెట్టారు. చివరకు ఈటల భార్య జమున ప్రచారం చేయకుండానే అక్కడినుంచి వెనక్కు తిరిగారు. అనంతరం వార్డు కౌన్సిలర్ కొండ్ర జీవిత సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈటల రాజేందర్ ఎమ్మెల్యే, మంత్రిగా ఉన్నప్పుడు ఇందిరానగర్ ప్రజలను పట్టించుకోలేదని జీవిత విమర్శించారు.
దళితుల్లో చిచ్చు పెడ్తరా?
సీఎం కేసీఆర్ దళితులను బాగుచేసేందుకు దళితబంధు ఇత్తండు. బీజేపోళ్లు రాజకీయం చేసుకుంటే.. చేసుకొన్రి. తప్పుడు ప్రచారాలు జేసుడేంది? కొందరికే అత్తయని చెప్తరా..? ఎవ్వలకు రావని చెప్పుకుంట తిరుగుతరా? బీజేపీ కలర్ మారింది. కొత్త కలరేసుకుని వచ్చిన్రు. ఇంటింటికీ తిరుగుతన్రు. తప్పుడు ప్రచారాలను అడ్డుకుంటం. అడ్డుకున్నం. ఎల్లగొట్టినం. కేసీఆర్ దళిత బాంధవుడు. అందరికీ దళితబంధు అత్తది.