HomeTelanganaPublic Outrage Over Proposed Cement Plant In Ramannapet
Musi River | మూసీ మోసం.. హైదరాబాద్‌లో సుందరీకరణ.. యాదాద్రిలో కాలుష్యీకరణ
ఆహ్లాదకర ప్రశాంత వాతావరణం.. చుట్టూ చెరువులు.. పచ్చని పొలాలు.. నేటికీ కుల వృత్తులతో ఉపాధి.. ఆరోగ్యవంతమైన జీవనం.. బడుగు బలహీన వర్గాల పేదలు.. ఇదీ యాదాద్రి భువనగిరి జిల్లాలోని రామన్నపేట పరిసర ప్రాంతాలవాసుల జీవన గమనం.
రామన్నపేటలో అంబుజా సిమెంట్ కంపెనీ ఏర్పాటుకు చర్యలు
2 లక్షల మందిపై తీవ్ర ప్రభావం
వ్యవసాయ భూములు, జంతు, వృక్ష జాతులపైనా ఎఫెక్ట్
పరిశ్రమ మధ్యలోంచే మూసీ ధర్మారెడ్డిపల్లి కాలువ
వ్యతిరేకిస్తున్న స్థానికులు
ఇటు మొదలు, అటు చివర.. రెండుచోట్లా మోసమే!
ఒకవైపు పునరుజ్జీవమంటూనే ఉరితాడు పేనుతున్నరు!
మరోవైపు ప్రక్షాళన అంటూనే విషతుల్యం చేస్తున్నరు!
ఆద్యంతాలను దెబ్బతీసి.. మధ్యలో ‘ఆపరేషన్ మూసీ’!
కాంగ్రెస్ సర్కారే తలారి.. ‘పునరుజ్జీవం’ ఓ గారడీ!
మూసీ జన్మస్థలమైన అనంతగిరి అడవుల్లోనే దానికి మరణశాసనం రాస్తున్నది రేవంత్ సర్కార్. దామగుండంలో రాడార్‌స్టేషన్ పేరిట లక్షలాది వృక్షాలను నరికివేయబోతున్నది. ప్రజల ఆందోళనను, పర్యావరణవేత్తల అభ్యంతరాలను పెడచెవినపెట్టి నదినే ప్రశ్నార్ధకం చేస్తున్నది. తొలి అడుగుపైనే గొడ్డలివేటు వేస్తున్నది. నదికి పురిట్లో పాతరేయడమేనా పునరుజ్జీవం?
నల్లగొండ జిల్లా రామన్నపేటలో మూసీతీరంలో డ్రైపోర్ట్, లాజిస్టిక్ పార్క్ పెడ్తామని భూములు సేకరించిన అదానీ సంస్థ.. ఇప్పుడు సిమెంట్ ఫ్యాక్టరీకి సిద్ధమైంది. కొత్త దోస్తుకు వంతపాడుతున్న రేవంత్ సర్కార్.. అందుకు అన్ని అనుమతులూ ఇచ్చింది. 2 లక్షల మంది ప్రజల అన్నంలో బూడిదబోసే ఆ పరిశ్రమను స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తాగునీటికి, పొలాలకు ఆధారమైన నీళ్లు కలుషితం అవుతాయన్నది వారి ఆందోళన. కానీ ప్రభుత్వం చెవినపెట్టడం లేదు. నల్లగొండ ప్రజలు మూసీ మురికినీళ్లు తాగాల్నా అని ప్రశ్నిస్తున్న సీఎం.. అదే జిల్లాలో నదిని మరింత కాలుష్యమయం చేసే పరిశ్రమకు మద్దతిస్తున్నారు.ముక్కుమూసుకునేలా చేయడమేనా మూసీ ప్రక్షాళన?
అబద్ధానికి అంతుండాలె.
పొంతనైనా ఉండాలె.
మూసీపై రేవంత్ అబద్ధాలకు అంతూలేదు.. పొంతూ లేదు!
అడవిని తుడిచి నదికి జీవం పోస్తారట!
కాలుష్యాన్ని నింపి ప్రక్షాళన చేస్తారట!
దామగుండం, రామన్నపేట.. రెండు ఆందోళనలూ నదీపరిరక్షణ కోసమే! వాటిపై పెదవివిప్పని ప్రభుత్వం, మొండిగా మూసీని ముంచేందుకు సిద్ధమైంది. ఒకవైపు నది జన్మస్థలాన్ని దెబ్బతీసి.. మరోవైపు ఎక్కడ ప్రజలకు నీళ్లివ్వాల్నో అక్కడ కలుషితం చేసి.. మధ్యలో ఉన్న 55 కిలోమీటర్లు మాత్రం తళుక్కుమనేలా మెరిపిస్తామని సర్కారు నమ్మబలుకుతున్నది. అందుకు పేదల ఇండ్లు పడగొడ్తానని తొడగొడ్తున్నది.
కార్పొరేట్‌కు రెడ్‌కార్పెట్ పరిచి మూసీపై కఫన్!
ఇదీ సర్కారు హిపోక్రసీ!
రెజువనేషన్ చేతలకు నుసి!
Musi River | (పున్న శ్రీకాంత్) యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 20 (నమస్తే తెలంగాణ): ఆహ్లాదకర ప్రశాంత వాతావరణం.. చుట్టూ చెరువులు.. పచ్చని పొలాలు.. నేటికీ కుల వృత్తులతో ఉపాధి.. ఆరోగ్యవంతమైన జీవనం.. బడుగు బలహీన వర్గాల పేదలు.. ఇదీ యాదాద్రి భువనగిరి జిల్లాలోని రామన్నపేట పరిసర ప్రాంతాలవాసుల జీవన గమనం. కానీ మరికొన్ని రోజుల్లో ఈ ప్రాంతం కాలకూట విషంగా మారబోతున్నది. ఇక్కడి ప్రజలపై అదానీ పిడుగు పడింది. అదానీ అంబుజా సిమెంట్ కంపెనీ ఏర్పాటుకు అడుగులు పడుతున్నయి. ఈ కంపెనీతో నాలుగు మండలాల్లోని పలు గ్రామాలపై ప్రభావం పడనున్నది.
సుమారు రెండు లక్షల మంది ప్రజల జీవితాలు తారుమారు కానున్నాయి. ఓ వైపు మూసీ నది సుందరీకరణ, పునరుజ్జీవం అంటూ సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు ఊదరగొడుతున్నారు. మరోవైపు మూసీ ఒడ్డున కాలుష్య కారక కంపెనీలకు రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలుకుతున్నారు. నిన్న దామగుండం అంతర్థానానికి అడుగులు వేయగా, నేడు మూసీని ఆగం చేసే కుట్రకు పూనుకున్నారు. ఇప్పటికే ఆగమైన మూసీ కాలువలను మరింత మురికి కూపంగా మార్చేందుకు కంకణం కట్టుకున్నారు.
మూసీలో భాగమైన ధర్మారెడ్డిపల్లి కాలువ, పిలాయిపల్లి కాలువలు వ్యర్థ రసాయనాలతో కాలుష్య కాసారంగా మిగిలిపోనున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని రామన్నపేట, కొమ్మాయిగూడెం, సిరిపురం గ్రామాల పరిధిలో అదానీ అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని సదరు సంస్థ నిర్ణయించింది. 65.5 ఎకరాల్లో కంపెనీ స్థాపనకు చర్యలు తీసుకుంది. స్టాండ్ అలోన్ సిమెంట్ గ్రైండింగ్ యూనిట్లో ఏటా 6.0 ఎంఎంటీపీఏ సిమెంట్ ఉత్పత్తికి ప్రతిపాదనలు చేశారు. ప్రాజెక్ట్ వ్యయం రూ. రూ.1400 కోట్లు కాగా, రెండు దశల్లో నిర్మించనున్నారు. మొదటి దశలో రూ. 700 కోట్లు, రెండో దశలో రూ. 700 కోట్లు ఖర్చు చేయనున్నారు.
2 లక్షల మందిపై ఎఫెక్ట్
రామన్నపేట మండల కేంద్రానికి 500 మీటర్ల దూరంలోనే ప్రతిపాదన సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రామన్నపేట మండలంలో 24 గ్రామాలు ఉన్నాయి. దీనితోపాటు వలిగొండ, చిట్యాల, నార్కట్‌పల్లిలోని పలు మండలాల్లోని 2 లక్షల మంది ప్రజలపై సిమెంట్ కంపెనీ ప్రభావం పడనుంది. ముఖ్యంగా అతి సమీపంలో ఉన్న కొమ్మాయిగూడెం, రామన్నపేట, సిరిపురం, వెల్లంకి, బోగారం, తుమ్మలగూడెం, నీర్మెముల, నిదాన్‌పల్లి, జనంపల్లి, ఇస్కిల్ల, పెద్దకాపర్తి గ్రామాలు ఐదు కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాయి. ఆయా గ్రామాల ప్రజలు ప్రస్తుతం ఎలాంటి రోగాలు లేకుండా ప్రశాంతంగా జీవిస్తున్నారు. కంపెనీ ఏర్పాటైతే అన్ని రకాలుగా ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు.
కాలుష్య కాసారం.. అనారోగ్య జీవనం
అదానీ సిమెంట్ కంపెనీ ఏర్పడితే పర్యావరణం పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉంది. దీంతో జీవకోటి మనుగడకు ముప్పు వాటిల్లనుంది. సిమెంట్ పరిశ్రమ ద్వారా ఎగిసిపడే దుమ్ము, ధూళితో వాయు, శబ్ద, జల కాలుష్యం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ దగ్గరలో ముడి సరుకు అందుబాటులో లేవు. దీంతో పెద్ద ఎత్తున తెప్పించాల్సి ఉంటుంది. భారీ వాహనాల రాకపోకల కారణంగా శబ్దాల స్థాయి పెరుగుతుంది. సిమెంట్‌లో కలిపే రసాయనాల మూలంగా ప్రజలు ప్రాణాంతక వ్యాధుల బారినపడే ప్రమాదం లేకపోలేదు.
పరిశ్రమ నుంచి విడుదలయ్యే వ్యర్థ రసాయనాలైన జిప్సం, స్లాగ్, క్లింకర్, బొగ్గు, సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్ గాల్లో కలవడంతో ఊపిరితిత్తులు, శ్వాసకోశ వ్యాధులు సంభంవించే అవకాశాలు ఉన్నాయి. చర్మ రోగాలు, గర్భస్రావాలు, చిన్నపిల్లల్లో ఎదుగుదల లోపించడం, కంటి చూపు మందగించడం, దివ్యాంగత్వం వంటివి వచ్చే చాన్స్ ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భవిష్యత్తులో భూమి బూడిద, పసుపు, ముదురు గోధుమ రంగులోకి మారే ప్రమాదం ఉంది. దీంతో పంటలు పండక, దిగుబడి రాక రైతులు తీవ్రంగా నష్టపోతారు.
తప్పులతడకగా ‘అదానీ’ నివేదిక
సిమెంట్ కంపెనీ సంబంధిత ప్రాంతాల్లో అధ్యయం చేసింది. ఈ మేరకు ఓ నివేదికను విడుదల చేసింది. అందులో అన్నీ తప్పుల తడకగా పలు అంశాలను రూపొందించింది. ఈ ప్రాంతం పూర్తిగా వెనకబడిన ఏరియాగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. ఇక్కడ ఉన్న పెద్ద సంస్థలను కనీసం పొందుపర్చలేదు. ప్రతిపాదిత ప్రాంతం కూతవేటు దూరంలో ప్రభుత్వ ఏరియా దవాఖాన, డిగ్రీ కాలేజీ ఉన్నా ఎక్కడా ప్రస్తావించలేదు. ఇక్కడి ప్రాంత ప్రజలు ఇంకా చేతి పంపు నీరు తాగుతున్నారని. 24 గంటల కరెంట్ సరఫరా ఉండదని చెప్పుకొచ్చింది. పరిశ్రమ వస్తేనే ఆయా ప్రాంతాలు బాగుపడుతాయన్నట్టుగా పేర్కొంది. పరిశ్రమలో భాగంగా స్థానికులకు విద్యార్హతలను బట్టి ఉపాధి కల్పిస్తామని, అది కూడా తొలి దశలో 90 మందికి మాత్రమే ఇస్తామని తెలపడం గమనార్హం.
మూసీ కాలువలకు ముప్పు
సిమెంట్ పరిశ్రమతో మూసీలో భాగమైన ధర్మారెడ్డిపల్లి, పిలాయిపల్లి కాలువలు పూర్తిగా మురికి కూపంగా మారనున్నాయి. మూసీ నీరు వలిగొండ మండలం గోకారం చెరువులోకి చేరుతుంది. అక్కడి నుంచి ఆసిఫ్‌నగర్ కాలువ, ధర్మారెడ్డి పల్లి కాలువలు వేరుగా ప్రవహిస్తాయి. ఇక్కడ సిమెంట్ పరిశ్రమ మధ్యలో నుంచే ధర్మారెడ్డిపల్లి కాలువ వెళ్తున్నది. ఆ కంపెనీకి ఇదే కలిసివచ్చే అంశం. ఈ ఫ్యాక్టరీకి రోజుకు లక్షల లీటర్ల నీళ్లు అవసరం. ఈ కాలువ ద్వారా రోజుకు 3 లక్షల నీళ్లు అందుతాయి. మిగతా నీళ్లు రామన్నపేట మండలంలోని గ్రామాల నుంచి తీసుకునే ప్రణాళిక రూపొందించారు. ఇంతవరకు బాగానే ఉన్నా అసలు ఫ్యాక్టరీ వ్యర్థాలు ఎక్కడ వదులుతారనే ప్రశ్న ఉత్పన్నమవుతున్నది.
ధర్మారెడ్డిపల్లి నీటిని ఉపయోగించుకోవడంతోపాటు, వ్యర్థాలను అందులోనే వదులుతారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ కాలువ సిమెంట్ ఫ్యాక్టరీ ఉన్న చోట నుంచి మరో 16 గ్రామాల వరకు పారుతుంది. ఇది చిట్యాల మండలం లింగోటం వద్ద ముగుస్తుంది. ఆయా గ్రామాలన్నీ ఈ కాలువపై ఆధారపడి ఉన్నాయి. ఈ వ్యర్థాలన్నీ ఆయా గ్రామాలకు తాకి నష్టం చేకూర్చనున్నాయి. పిలాయిపల్లి, కాళేశ్వరం కాలువలు సమీపం నుంచే పారుతున్నాయని, ఇవి కూడా కాలుష్యంగా మారే ప్రమాదం ఉందని ఈ ప్రాంతవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే ‘మూసీ’తో ఆగమాగం..
హైదరాబాద్ మహానగర డ్రైనేజీ వాటర్‌తో మూసీ కలుషితమైంది. కొత్తగా అంబుజా సిమెంట్ పరిశ్రమ తోడైతే జీవకోటి మనుగడ ప్రశ్నార్థకంగా మారనుంది. మూసీ అంటేనే ముక్కుపుటాలదిరే దుర్గంధం. ఈ ప్రాంతాల్లో కాలుష్యపు నీటి కారణంగా వరిపంట దిగబడి తగ్గిపోయింది. పండిన పంట సైతం రంగు మారి, తాలు రూపంలో బరువు తక్కువగా ఉంటున్నదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ పండించిన పంటకు సైతం సరైన గిట్టుబాటు ధర లేదు. ఇక్కడ పంటను ఎవరూ కూడా తినరు. మూసీ పరీవాహక ప్రాంతం చేపలను ముట్టుకోవడానికే భయపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు చర్యలు ఇక్కడి ప్రజలను భయపెడుతున్నది.
‘అదానీ’పై ప్రజల తిరుగుబాటు
రామన్నపేటలో సిమెంట్ పరిశ్రమ ఏర్పాటుపై అన్ని వర్గాల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏర్పాటు చేయనివ్వబోమని ఘంటాపథంగా చెప్తున్నారు. అన్ని పార్టీల నేతలు ఒక్కతాటిపైకి వచ్చారు. అంతా కలిసి పర్యావరణ పరిరక్షణ వేదికను ఏర్పాటు చేశారు. దీని ఆధ్వర్యంలోనే ఉద్యమబాట పట్టారు. రోజువారీ కార్యక్రమాలు చేపడుతున్నారు. మేధావులతో సమావేశమయ్యారు. ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు అందించారు. తాజాగా పరిశ్రమను వ్యతిరేకిస్తూ ఈమెయిల్ ద్వారా సందేశాలు పంపిస్తున్నారు. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాల నిర్వహణకు ప్రణాళిక చేస్తున్నారు.
23న ప్రజాభిప్రాయ సేకరణ
రామన్నపేటలో అదానీ అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై 23న ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించనున్నారు. ఇప్పటికే కాలుష్య నియంత్రణ మండలి అధికారులు ప్రకటన చేశారు. కలెక్టర్ లేదా జేసీ సమక్షంలో ప్రజల అభిప్రాయాలు తీసుకోనున్నారు. జనం నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో భారీ బందోబస్తు మధ్య అభిప్రాయాలను తీసుకోనున్నట్టు తెలుస్తున్నది.
డ్రైపోర్టు, లాజిస్టిక్ పార్కు పేరుతో భూములు కొని..
గతంలో రామన్నపేటలో డ్రైపోర్టు, లాజిస్టిక్ పార్కు ఏర్పాటు చేస్తామని కొమ్మాయిగూడెం, రామన్నపేట, సిరిపురం ప్రాంత రైతుల నుంచి 350 ఎకరాలను అదానీ గ్రూపు కొనుగోలు చేసింది. ప్రజలు, పొలాలకు ఎలాంటి కాలుష్యం లేని ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని చెప్పడంతో ఉద్యోగావకాశాలు వస్తాయనే ఆశతో రైతులు భూములు అమ్మారు. అదానీ కొనుగోలు చేసిన భూమలున్నీ పంట పొలాలే. కానీ నేడు అదే కంపెనీ కొత్తగా అంబుజా సిమెంట్ కంపెనీతో పేరుతో రైతులను నట్టేట ముంచే కార్యక్రమానికి సిద్ధపడుతున్నది.
నిన్న దామగుండం.. నేడు రామన్నపేట
కాంగ్రెస్ సర్కారు మూసీ సుందరీకరణ అంటూనే మూసీని ఆనవాళ్లు లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నది. ఇటీవల మూసీ జన్మస్థలం అయిన వికారాబాద్ అడవుల్లో నేవీ రాడార్ స్టేషన్‌కు శంకుస్థాపన చేసింది. దీంతో అడవికి ముప్పు వాటిల్లుతుందని, మూసీ అంతర్థానమవుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మూసీ పరీవాహక ప్రాంతమైన రామన్నపేటను మరింత మురికి కూపంగా, కాలుష్య కాసారంగా చేసే కుట్ర చేస్తున్నదని పలువురు ఆరోపిస్తున్నారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకుంటం
మేం ప్రశాంతంగా జీవిస్తున్నం. ఊరికి 500 మీటర్ల దూరంలోనే సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామంటే ఊరుకుంటామా? నాడు అదానీ కంపెనోళ్లు మోసం చేసి ఆ భూములను కొన్నరు. లాజిస్టిక్ పార్కు ఏర్పాటు చేస్తామంటే వ్యవసాయలు భూములు ఇచ్చాం. ఇప్పుడు అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని వస్తున్నరు. దామరచర్ల పోయి సిమెంట్ కంపెనీలను చూసొచ్చినం. ఎడారిగా మారడం ఒక్కటే మిగిలింది. ఎట్టి పరిస్థితుల్లో పరిశ్రమ పెట్టనీయం.
-మహమ్మద్ రెహాన్,
పర్యావరణ పరిరక్షణ వేదిక కోకన్వీనర్
పరిశ్రమ పేరెత్తితే తరిమికొడ్తం
సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌లో మూసీ సుందరీకరణ అంటడు. మరి మా దగ్గర ఎందుకు కాలుష్యీకరణ? మూసీలో భాగమైన ధర్మారెడ్డిపల్లి కాలువ పరిశ్రమ మధ్యలోంచే పోతున్నది. పరిశ్రమ వ్యర్థాలన్నీ కాలువలోకి వదలడానికా? పరిశ్రమతో రెండు లక్షమందిపై ప్రభావం పడుతుంది. అన్ని వర్గాల ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. పరిశ్రమ పేరెత్తితే తరిమికొట్టుడే. రామన్నపేటలో పరిశ్రమ ఏర్పాటు చేయొద్దు.