దామరచర్ల, జనవరి 18 : నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం గణేశ్పాడులోని పెన్నాసిమెంటు కర్మాగారాన్ని అదానీ గ్రూప్ కొనుగోలు చేసి ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకొనేందుకు శనివారం నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ భారీ పోలీసు బందోబస్తు మధ్య సాగింది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు, పెన్నా సిమెంటు కర్మాగార ప్రభావిత గ్రామాల్లోని సామాజిక కార్యకర్తలు, బీఆర్ఎస్, సీపీఎం నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. ఈ సిమెంటు కర్మాగారం కింద 354.236 హెక్టార్ల మైనింగ్ లీజు ఉండగా అందులో దామరచర్ల మండలం గణేశ్‌పాడులో 303.664 హెక్టార్లు, సూర్యాపేట జిల్లా శూన్యంపాడులో 50.572 హెక్టార్లలో ఉత్పత్తి సామర్థ్యాన్ని 1.5 ఎమ్టీపీని 1.8కి పెంచుకునేందుకు రెండు జిల్లాలకు వేర్వేరుగా ప్రజాభిప్రాయాలను కాలుష్య నియంత్రణ మండలి అధికారులు నిర్వహించారు.
ఎన్జీవోలు మాట్లాడుతూ పరిశ్రమతో మూసీ నది కలుషితం అవుతుందని, పంటలు, ఆరోగ్యం దెబ్బతింటాయని పేర్కొన్నారు. కాలుష్యం నివారణ చర్యలు చేపట్టాలని, ప్రభావిత గ్రామాల్లో స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. పెన్నా సిమెంట్ ఫ్యాక్టరీ విస్తరణలో భాగంగా చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణను అడ్డుకుంటారనే అనుమానంతో నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ప్రశ్నిస్తారనే భయంతోనే ముందస్తుగా అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు.