నిరుద్యోగులు సమరభేరి మోగించారు. ఉద్యోగాలు..హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. కాంగ్రెస్ సర్కారు నయవంచనకు గురిచేస్తున్నదని మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో హస్తం పార్టీకి గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. 2 లక్షల ఉద్యోగాల భర్తీ కోసం జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలంటూ.. నిరుద్యోగ జేఏసీ తెలంగాణ నేత ఇంద్రనాయక్ ఆధ్వర్యంలో ‘హలో నిరుద్యోగి చలో ఇందిరాపార్కు’ పేరుతో బుధవారం ఇందిరాపార్కు వద్ద మహాధర్నా నిర్వహించారు.
పెద్ద ఎత్తున తరలివచ్చిన నిరుద్యోగులు వివిధ నినాదాలతో కూడిన ప్లకార్డులను ప్రదర్శిస్తూ..సర్కారుకు వ్యతిరేకంగా రణనినాదం చేశారు. ప్రముఖ విద్యావేత్త అశోక్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్, తెలంగాణ క్రాంతిదళ్ అధ్యక్షుడు పృథ్వీ, తెలంగాణ ఉద్యమకారుడు విఠల్, ప్రసన్న హరికృష్ణ పాల్గొని నిరుద్యోగుల నిరసనకు మద్దతు పలికారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు. రాష్ట్రంలో ఎన్నికల నోటిఫికేషన్లు తప్ప.. ఉద్యోగ నోటిఫికేషన్లు లేవంటూ.. ఎద్దేవా చేశారు.

ప్రభుత్వానికి రాజకీయ నిరుద్యోగలపై ఉన్న ప్రేమ నిరుద్యోగ విద్యార్థులపై లేదని మండిపడ్డారు. నిరుద్యోగుల జీవితాల్లో మార్పు వస్తుందని నమ్మి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెనెక్కిస్తే రెండేండ్లుగా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకుండా నిరుద్యోగులకు మొండి చేయి చూపిందని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కల్పించిన ఉద్యోగాలు తామే ఇచ్చామని కాంగ్రెస్ గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. నిజంగా కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి ఉంటే ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలను భర్తీ చేశారో అశోక్‌నగర్ చౌరస్తాలో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.