జనగామ, మార్చి 31 (నమస్తే తెలంగాణ) : రైతుల పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లభించేలా క్రయ విక్రయాలను సులభతరం చేసేందుకు తెచ్చిన డిజిటల్ వ్యవసాయ వాణిజ్య వేదిక ఈనామ్ (జాతీయ వ్యవసాయ మార్కెట్) పథకం జనగామ వ్యవసాయ మార్కెట్లో నామ్‌కే వాస్తేగా మిగిలింది. ఫలితంగా నాణ్యతను బట్టి అన్నదాతకు మంచి ధర లభించక పోగా, మార్కెట్ ఆదాయానికి గండి పడుతున్నది. రైతులు పండించిన వివిధ రకాల పంట ఉత్పత్తులను అమ్మకానికి తెస్తున్నప్పటికీ జనగామ మార్కెట్లో తొలుత ధాన్యం, మక్కజొన్న, ఆ తర్వాత రైతుల నుంచి వచ్చిన ఒత్తిడితో వేరుశనగను ఈనామ్‌లో కొనుగోలు చేస్తున్నారు. చింతపం డు, చింతగింజలు, జొన్నలు వంటి చిరు ధాన్యాలను ఈ నామ్లో చేర్చకపోవడంతో జీరో దందాకు తెరలేస్తున్నది.
మార్కెట్లో మొత్తం 54 మంది ట్రేడర్లున్నా నలుగురైదుగురు మాత్రమే ఈనామ్ కొనుగోళ్లలో పాల్గొంటున్నారు. ఈ విధానం కింద కొనుగోలు చేసే ధరలను ఒంటి గంటకు ప్రకటించాల్సినప్పటికీ సాయంత్రం 4 గంటలైనా తేల్చడంలేదు. వచ్చిన సరుకులో సగానికి బిడ్ దాఖలు చేస్తుండగా, మిగిలింది ‘ఖుషీ’ ధరల పేరిట కొనుగోలు చేస్తున్నారు. రైతుల అవసరాన్ని ఆసరాగా చేసుకొని ట్రేడర్లు అక్రమ కొనుగోళ్ల దందాకు తెరలేపి తమకు నచ్చిన ఖరీదుదారుకు అప్పగించి తలా కొంత పంచుకుంటున్నారు.
అధిక కమీషన్, అక్రమ లావాదేవీలకు ఆస్కారం లేకుండా ఉండేందుకు రైతులకు ఆన్లైన్లో తక్‌పట్టీలు ఇవ్వాల్సి ఉండగా ఇక్కడ మాత్రం తెల్ల చీటీలను ఇస్తున్నారు. కొనుగోలు, అమ్మకాలపై తక్‌పట్టీలు జారీ చేయడం వల్ల రైతులకు రైతు భరోసా, ప్రమాద బీమా వంటి ప్రయోజనాలు వర్తిస్తాయి. గేట్ వద్ద నమోదైన వివరాలకు, కొనుగోళ్లకు, అసెస్మెంట్కు తేడాలుంటే తెలిసిపోతుంది. ఖరీదు వివరాలు తగ్గించి పన్నులు ఎగవేసేందుకే ఆఫ్‌లైన్ తక్‌పట్టీల విధానాన్ని అనుసరిస్తున్నారు. ఈ నామ్లో కనీస ధర సీలింగ్ విధానాన్ని అడ్డుపెట్టుకొని మోసాలకు పాల్పడుతున్నారు.
కొందరు వ్యాపారులు ఆన్లైన్ లావాదేవీలు జరగకుండా చేసి ఆఫ్‌లైన్‌లో ఇష్టం వచ్చిన ధరకు కొనుగోలు చేస్తున్నారు. మద్దతు ధరకు మించి డిమాండ్ ఉన్న ఉత్పత్తులు ఈనామ్‌లో అయితే తమకు గిట్టుబాటు కాదని భావిస్తున్న వ్యాపారులు దొడ్డిదారిన బహిరంగ వేలం వేయిస్తున్నారు. పండుగలు ఇతరత్రా మార్కెట్‌కు వరుస సెలవుల అనంతరం వేలాది బస్తాల ధాన్యం, మక్కలు వచ్చి కొనుగోళ్లలో ప్రతిష్టంభన ఏర్పడడాన్ని ఆసరాగా చేసుకొని వ్యా పారులు మూడొంతుల ధాన్యం ఖుషీ ధరకు కొంటున్నారు. సగం లాట్లను ఈ నామ్ బిడ్డింగ్‌లో వేసి మిగతా సగాన్ని రికార్డుల్లో చేర్చకుండా కొనుగోలు చేస్తుండడంతో ప్రతినెలా రూ. లక్షల్లో మార్కెట్ ఆదాయం పక్కదారి పడుతున్నది.
ఈ నామ్ విభాగం కనుమరుగు..
ఈ నామ్ అమలు కోసం జనగామ వ్యవసాయ మార్కెట్ కాటన్యార్డులో పూర్తి సౌకర్యాలతో కూడిన రైతు భవనాన్ని గతంలోనే నిర్మించారు. కంప్యూటర్ విభాగం సహా వివిధ మార్కెట్లలో రోజువారీ ధరలను తెలుసుకునేందుకు లక్షలాది రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన వ్యవస్థ ఇప్పుడు కనుమరుగైంది. కంప్యూటర్లు, విలువైన సామగ్రి మాయమైంది. ఆ భవనంలో కొంత మేరకు ఈవీఎంలు, ఎన్నికల సామగ్రిని భద్రపరిచారు. మరికొన్ని గదులను మార్కెటింగ్ శాఖ జిల్లా కార్యాలయానికి వినియోగిస్తున్నారు.
జీరో దందాకు ప్రోత్సాహం..
పారదర్శక విధానంలో అమ్మకం, కొనుగోలు జరిగితే మార్కెట్ సెస్ నూటికి రూపాయి చెల్లించాల్సి ఉంటుంది. సెస్ చెల్లిస్తే వాణిజ్య పన్ను చెల్లింపు కూడా తప్పనిసరి కావడంతో దీన్ని ఎగవేసేందుకు వ్యాపారులు జీరో దందాకు మొగ్గుచూపుతున్నారు. దీనికి ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించిన వారికి 30 కిలోల బస్తా ఒక్కంటికి రూ. 25 వరకు అమ్యామ్యాలు ఇస్తున్నారు. దీంతో ఏటా మార్కెట్, వాణిజ్య పన్నుల శాఖ ఆదాయానికి గండి పడుతున్నది. మార్కెట్ పన్ను వసూలు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్న దానికి, వాస్తవానికి పొంతన లేదు. వచ్చే సరుకులో కొంతనే నమోదు చేసి దానికి మాత్రమే ఫీజు తీసుకుంటున్నట్లు తెలుస్తున్నది.
కొత్త విధానంతో రైతులకు ఇబ్బంది..
కొత్తగా అమల్లోకి తెచ్చిన ఈనామ్ 2.0 ద్వారా మార్కెట్ యార్డుల్లో పంటలు అమ్ముకోవాలనుకునే రైతులు తమ పేర్లు నమోదు చేసుకోవాలనే నిబంధన ఇబ్బందికరంగా మారగా, దళారులకు అనుకూలమైంది. ఇప్పటికే యూరియా యాప్‌తో అవస్థలు పడుతున్న అన్నదాతకు ఇది కూడా గుదిబండగా మారింది. అమ్మకందారులైన రైతులు, కొనుగోలుదారులైన వ్యాపారులు సైతం ఈ నామ్ వేదిక యాప్‌లో పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకుంటే వారికి ప్రత్యేక గుర్తింపు కార్డుతో కూడిన సంఖ్య ఇస్తారు. అయితే దీనిపై అధికారులు అవగాహన కల్పించలేదు. పాత సాఫ్ట్‌వేర్‌ను ఈనామ్ 2.0 గా మెరుగు పరిచి తొమ్మిది పంట ఉత్పత్తులను చేర్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 57 వ్యవసాయ మార్కెట్ కార్యదర్శులకు శిక్షణ ఇచ్చారు. అయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఎనుమాముల, మహబూబాబాద్, కేసముద్రం, జనగామ మార్కెట్లలో దీనిని ప్రవేశపెట్టినప్పటికీ సాఫ్ట్‌వేర్‌లో లోపాలతో పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు.