హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 8 (నమస్తే తెలంగాణ)/బండ్లగూడ : రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని హైదర్‌గూడ నలందనగర్లో స్థానికులు పార్కు స్థలాన్ని ఆక్రమించారంటూ మంగళవారం హైడ్రా కూల్చివేతలకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. కూల్చివేతలను అడ్డుకున్న స్థానికులు తమ దగ్గరరున్న ఆధారాలు చూపించారు. ఆ పత్రాలను పరిగణనలోకి తీసుకోవాలని వేడుకున్నారు. సర్వే నిర్వహించి, అక్రమమని తేలితే.. అప్పుడు నోటీసులు ఇచ్చి కూల్చివేయాలని కోరారు. అయినా అధికారులు వినిపించుకోలేదు. బాధితులు జేసీబీలకు అడ్డుపడటంతో.. పోలీసులు వారిని అక్కడి నుంచి బలవంతంగా పక్కకు తప్పించేందుకు యత్నించారు. నిలువనీడ లేకుండా చేస్తున్న బుల్డోజర్ను ముందుకు పోనివ్వకుండా బాధితులు జేసీబీలకు అడ్డంగా పడుకున్నారు. తమను తొక్కుకుంటూ పోతారా అంటూ మహిళలు నిలదీశారు.
భారీగా మోహరించిన పోలీసుల సాయంతో బాధితులను పక్కకు తొలగించారు. నిరసన తెలిపిన వారిని రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం హైడ్రా అధికారులు కూల్చివేతలను కొనసాగించారు. హైదర్‌గూడ గ్రామం సర్వే నంబర్ 16లోని 1000గజాల జాగలో ఉన్న పార్క్‌స్థలాన్ని కొందరు ఆక్రమించి ప్రహారీని నిర్మించినట్టు నలందానగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు హైడ్రాకు ఫిర్యాదు చేశారని తెలిపారు. విచారణ జరిపిన తర్వాతనే కూల్చివేతలు చేపట్టామని చెప్పారు. పెద్దలకు చెందిన భవనాలకు నోటీసులు జారీ చేసి, సమయం ఇస్తున్న అధికారులు… తమ ఇండ్లపైకి మాత్రం ఆకస్మికంగా కూల్చివేయడమేంటని బాధితులు ప్రశ్నించారు. పట్టాలు ఉన్నాయని చెప్తున్నా కూల్చివేతలకు పాల్పడటమేంటని ఆగ్రహం వ్యక్తంచేశారు.