హైదరాబాద్, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఆవిర్భావం, అభివృద్ధికి సంబంధించిన అంశాలను కలగలిపి ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా సమగ్ర ప్రణాళికతో ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార అధికారులను ఆదేశించారు. దుబాయ్ ఫెస్టివల్ పూర్తిగా దుబాయ్‌కి దూరంగా జరుగుతుందని, అదే తరహాలో మన రాష్ట్రంలోనూ ఫ్యూచర్ సిటీలో కొన్ని ప్రదర్శనల ఏర్పాటుకు అధికారులు ఆలోచన చేయాలని, సీనియర్, జూనియర్ అధికారులతో కలిపి కమిటీలు వేయాలని సూచించారు. శుక్రవారం ఆయన సచివాలయంలో ప్రభుత్వ సలహాదారు కే కేశవరావుతో కలిసి ప్రజాపాలన విజయోత్సవాల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి భట్టి మాట్లాడుతూ.. తెలంగాణ ఎలా ఆవిర్భవించింది? కొత్త రాష్ట్రంలో ఎన్ని విజయాలు నమోదు చేశాం? భవిష్యత్తులో తెలంగాణ ఏం సాధించబోతున్నది? అనే విషయాలను ప్రపంచానికి వివరించేలా ప్రజాపాలన విజయోత్సవాలు ఉండాలని అధికారులకు స్పష్టం చేశారు. ఈ విజయోత్సవాలకు పెట్టుబడిదారులను ఆహ్వానిస్తున్నామని, రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు వారితో ఒప్పందాలు కుదుర్చుకునేందుకు అనువైన వాతావరణం కల్పించాలని ఆదేశించారు.