హైదరాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ): సీఎం హామీ ఇచ్చినట్టు పదివేల ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయ (పీఎస్ హెచ్ఎం) పోస్టులను మంజూరు చేయాలని పీఆర్టీయూ టీఎస్ ప్రభుత్వాన్ని కోరింది. జీవో నెంబర్ -11, 12ను సవరించి, బీఈడీ అర్హత గల ఉపాధ్యాయులకు పీఎస్ హెచ్ఎంగా పదోన్నతులు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.
పీఆర్టీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శుల సమావేశాన్ని సోమ, మంగళవారాల్లో నిర్వహించారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి, పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు పింగిలి శ్రీపాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి బీరెల్లి కమలాకర్‌రావు తదితరులు పలు అంశాలపై చర్చించి, తీర్మానాలు చేశారు.
పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఏలను విడుదల చేయాలని, పీఆర్సీలో 50శాతం ఫిట్‌మెంట్‌ను వర్తింపజేయాలని, సీపీఎస్ రద్దుచేయాలని, 2003 డీఎస్సీ టీచర్లకు పాత పెన్షన్ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్సీలు మోహన్‌రెడ్డి, రవీందర్, మాజీ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, పత్రిక సంపాదకుడు ఇన్నారెడ్డి, 31 జిల్లాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.