ఖమ్మం అర్బన్, నవంబర్ 28 : కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేండ్లు అవుతున్నా సమస్యలు పరిష్కారం కావడం లేదని, ఎన్నికల సమయంలో ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులు, పెన్షనర్స్ బకాయిలు, పెండింగ్ డీఏలు విడుదల చేయాలని, పీఆర్సీని వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం నగరంలోని అమరవీరుల స్తూపం వద్ద పీఆర్టీయూ జిల్లా శాఖ చేపట్టిన 30 గంటల నిరాహార దీక్ష శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ముగిసింది.
ఉపాధ్యాయులకు శ్రీపాల్‌రెడ్డి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. అనంతరం సంఘం జిల్లా అధ్యక్షుడు కట్టా శేఖర్‌రావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. అపరిష్కృత సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా.. రేవంత్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘం నాయకులు సోమిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, మోతుకూరి మధు, వెంకటనర్సయ్య, రంగారావు తదితరులు పాల్గొన్నారు.