హైదరాబాద్, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ): మేడిగడ్డ కుంగుబాటు పేరిట బీఆర్ఎస్ను బద్నాం చేయడం ఆపి, భేషజాలకు పోకుండా కాళేశ్వరం ద్వారా రైతులకు సాగునీరు అందించాలని మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన కాళేశ్వరం ప్రాజెక్టును పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఎక్కడైనా చిన్నపాటి మరమ్మతులు ఉంటే వాటిని పూర్తిచేసి నీటిని విడుదల చేయాలని కోరారు. అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డ బరాజ్‌లలో నీటిని నిల్వ చేసి, వెంటనే ప్రాజెక్టులన్నింటినీ నింపాలని సూచించారు. మల్లన్నసాగర్, ఎల్లంపల్లి, కొండపోచమ్మ, రంగనాయక సాగర్‌ను రిజర్వాయర్లను నింపి యాదాద్రి భువనగిరి, సిద్దిపేట, సూర్యాపేట జిల్లాలకు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఎస్సారెస్పీ ఫేజ్ -2 ద్వారా కూడా నీటి సరఫరాకు అనుకూలంగానే ఉన్నదని చెప్పారు. బీఆర్ఎస్పై కోపంతో రైతులకు అన్యాయం చేయొద్దని హితవు పలికారు. బద్నాంలు బంద్‌పెట్టి ప్రజలకు మేలుచేసే విధంగా కాళేశ్వరం ప్రాజెక్టును మనుగడలోకి తీసుకురావాలని కోరారు. రైతు కోణంలో సీఎం రేవంత్‌రెడ్డి ఆలోచించాలని సూచించారు.