హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ)/ సిద్దిపేట/చందంపేట (దేవరకొండ) : అనుకోని విపత్తు రాష్ర్టాన్ని అల్లకల్లోలం చేసిందని, రాజకీయాలకు అతీతంగా ప్రజలకు సహాయ సహకారాలు అందించాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు సూచించారు. అల్పపీడన ప్రభావంతో వర్షాలు కురుస్తున్నందున అవసరమైన ప్రాంతాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేయాలని, వర్షాల సందర్భంలో ప్రభుత్వం ముందుచూపుతో వ్యవహరించాలని చెప్పారు. వర్షాలు, వరదల కారణంగా ఎంతోమంది ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని, వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
భారీ వర్షాలు, ప్రజల కష్టనష్టాలపై స్పందిస్తూ ఆదివారం ప్రకటన విడుదల చేయడంతో పాటు నల్లగొండ జిల్లా దేవరకొండలో మాజీ మంత్రులు జగదీశ్‌రెడ్డి, గంగుల కమలాకర్, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్‌తో కలిసి హరీశ్ విలేకరులతో మాట్లాడారు. కొందరు తమ కుటుంబ సభ్యులను కోల్పోయి ఆవేదన చెందుతుంటే, మరికొందరు నిరాశ్రయులై రోడ్డుమీద పడ్డారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇంకొందరు పాడి పంటలు కోల్పోతే, మరికొందరు ఉపాధి కోల్పోయి కన్నీరు పెడుతున్నారని చెప్పారు. ఇలాంటి ఆపతాలంలో ఒకరికొకరు బాసటగా నిలవాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఆపదలోఉన్న ప్రజలకు విశ్వాసం కలిగించేలా ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని కోరారు. మరో రెండు మూడు రోజులు భారీ వర్షాలు ఉన్నాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రభావిత ప్రాంతాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని, రాష్ట్ర, జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించాలని, ప్రజలను అప్రమత్తం చేయాలని, ఇరిగేషన్, వ్యవసాయ, రెవెన్యూ అధికారులను అలర్ట్‌గా ఉంచాలని, అత్యవసర వైద్యసేవలకు అంతరాయం కలగకుండా చూడాలని, ఏజెన్సీ, ముంపు ప్రాంతాల్లో గర్భిణులను దవాఖానలకు తరలించాలని, పాముకాటు, కరెంట్ షాక్‌లకు గురైన వారికి తక్షణ వైద్యసేవలు అందేలా చూడాలని, ముంపు ప్రాంతాల ప్రజలను కాపాడేందుకు కేంద్రం సాయం కోరాలని, ఎన్డీఆర్ఎఫ్ను రంగంలోకి దింపాలని, హెలీకాప్టర్లను సైతం సిద్ధ్దం చేసుకోవాలని సూచించారు.
వరద బాధితుల కోసం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి ఆహారం, తాగునీరు అందించాలని, వైద్య శిబిరాలు నిర్వహించాలని, ప్రభావిత ప్రాంతాలను ముందే గుర్తించి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పారు. తాత్కాలిక ఉపశమనం కోసం లక్ష ఆర్థిక సాయం చేయడంతో పాటు విపత్తులో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా, గాయపడ్డ వారికి రూ.5 లక్షల ఆర్థికసాయం ఇవ్వాలని ప్రభుత్వానికి హరీశ్ విజ్ఞప్తి చేశారు. సహాయక చర్యల కోసం ఖమ్మంలో ఆందోళన చేస్తున్నారని, ప్రభుత్వం తక్షణమే స్పందించాలని కోరారు. కేసీఆర్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అన్ని జిల్లాల నాయకులు, కార్యకర్తలు ప్రజలకు అందుబాటులో ఉండి సహాయక చర్యలు చేపట్టాలని, కష్టకాలంలో ప్రజలకు తోడుగా నిలవాలని పిలుపునిచ్చారు. విలేకరులతో సమావేశంలో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యేలు భాస్కర్‌రావు, గాదరి కిశోర్‌కుమార్, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, కంచర్ల భూపాల్‌రెడ్డి పాల్గొన్నారు.