హైదరాబాద్, జనవరి 9 (నమస్తే తెలంగాణ) : పోలీస్‌శాఖలోని అన్ని విభాగాల్లో ఖాళీల ను భర్తీ చేసేందుకు తక్షణమే 20వేల పోస్టులతో నోటిఫికేషన్ ఇవ్వాలని నిరుద్యోగ జేఏసీ ప్రతినిధులు శుక్రవారం ప్రజావాణిలో విన్నవించారు. ప్రజాభవన్‌లో నిర్వహించిన ప్రజావాణికి ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి హాజరయ్యారు. రెండేండ్లు దాటినా ప్రభుత్వం ఒక పోలీస్ ఉద్యోగం కూడా భర్తీ చేయలేదని జేఏసీ ప్రతినిధులు పేర్కొన్నారు.
వచ్చే పోలీస్ నోటిఫికేషన్లో వయోపరిమితిని 35 ఏండ్లకు పెంచాలని డిమాండ్ చేశారు. జీవో-46ను రద్దుచేసి లాంగ్‌జంప్‌ను 3.8మీటర్లకు కుదించాలని కోరారు. స్పందించిన చిన్నారెడ్డి.. డీజీపీ, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్‌కు లేఖ రాసి నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరారు. మున్సిపల్ ఎన్నికల్లోగా నోటిఫికేషన్ ఇవ్వకపోతే తమ సత్తా చూపిస్తామని ప్రతినిధులు ఆకాశ్, శంకర్, వంశీ, నవీన్‌పట్నాయక్, శింబునాయక్ హెచ్చరించారు.
హైదరాబాద్, జనవరి 9(నమస్తే తెలంగాణ) : యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ స్టేజ్-2లోని మూడు 800 మెగావాట్ల ప్లాంట్ల ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్‌ను ప్రైవేట్‌కు అప్పగించడాన్ని తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ వ్యతిరేకించింది. ప్రైవేట్ లేదా బీహెచ్ఈఎల్కు అప్పగించడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. ఈ మేరకు జేఏసీ నేతలు శుక్రవారం టీజీ జెన్కో సీఎండీ హరీశ్‌తో భేటీ అయ్యారు.
జెన్కోలో నైపుణ్యం కలిగిన ఇంజినీర్లు ఉండగా ప్రైవేట్‌కు అప్పగించడమేంటని ప్రశ్నించారు. కేటీపీఎస్ స్టేజ్-2ను 48 నెలల్లోనే నిర్మించిన అనుభవం జెన్కో ఇంజినీర్ల సొంతమని గుర్తుచేశారు. వైటీపీఎస్ ఓఅండ్ఎం బాధ్యతలను జెన్‌కోకే అప్పగించాలని సీఎండీని కోరారు. సీఎండీని కలిసిన వారిలో జేఏసీ చైర్మన్ సాయిబాబా, కన్వీనర్ రత్నాకర్‌రావు, భూపాల్‌రెడ్డి, తాజుద్దీన్‌బాబా, ఈశ్వర్‌గౌడ్, నెహ్రూ, శ్రీకాంత్, వెంకటేశ్వర్లు, సదానందం, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.