హైదరాబాద్, మార్చి 25(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు విమాన సౌకర్యం కల్పించడంతో పాటు సామాన్యులకు విమాన ప్రయాణం అందుబాటులోకి తేవాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. మూడు పాత విమానాశ్రయాలను తిరిగి ప్రారంభించడంతో పాటు మరో మూడు గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టులను నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధంచేసినట్టు తెలిపారు. శుక్రవారం బేగంపేట విమానాశ్రయంలో వింగ్స్ ఇండియా-2022 విమాన ప్రదర్శనను మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డితో కలిసి పౌర విమానయానశాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. కొత్తగూడెం, నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి, మహబూబ్‌నగర్ జిల్లా గుదిబండలో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టులు, వరంగల్ జిల్లా మామునూర్, పెద్దపల్లి జిల్లా బసంత్‌నగర్, ఆదిలాబాద్‌లో బ్రౌన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టుల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపినట్టు తెలిపారు.
భారత విమానాశ్రయాల నియంత్రణ, నిర్వహణ సంస్థ ఇప్పటికే వీటి సాధ్యాసాధ్యాల పరిశీలన పూర్తిచేసిందని పేర్కొన్నారు. నాగార్జునసాగర్‌లో వాటర్ ఏరోడ్రోమ్ ఏర్పాటు ప్రతిపాదనపై కూడా ఎయిర్పోర్ట్ అథారిటీ అధ్యయనం పూర్తయిందని వివరించారు. డ్రోన్ల వినియోగాన్ని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం డ్రోన్ పాలసీని రూపొందించిందని, ఇప్పటికే మెడిసిన్ ఫ్రమ్ స్కై ప్రాజెక్టును చేపట్టినట్టు వెల్లడించారు. ఏరోస్పేస్ రంగంలో ఏడేండ్లలో సాధించిన పురోగతిని వివరించారు. సికోర్క్సీ, లాక్‌హీడ్ మార్టిన్, బోయింగ్, జీఈ, సఫ్రాన్ తదితర అనేక అంతర్జాతీయ సంస్థలు తెలంగాణలో తమ సంస్థలను ఏర్పాటుచేశాయని వివరించారు. ఈ రంగంలో ఇప్పటికే 30 పెద్ద కంపెనీలు, 1,000 ఎంఎస్ఎంఈలు కొనసాగుతున్నాయని చెప్పారు. రాష్ట్రంలో ఐదు ఏరోస్పేస్ పార్కులు, 50 జనరల్ ఇంజినీరింగ్ పార్కులను ఏర్పాటుచేసినట్టు వివరించారు. రాష్ట్రంలో ప్రపంచస్థాయి ఏరోస్పేస్ యూనివర్సిటీని ఏర్పాటుచేస్తామని ప్రశాంత్‌రెడ్డి తెలిపారు.
కరోనా కారణంగా నిలిచిపోయిన అంతర్జాతీయ విమాన సేవలను ఆదివారం నుంచి పూర్తిస్థాయిలో ప్రారంభించనున్నట్టు పౌర విమానయానశాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. వింగ్స్ ఇండియా 2022 విమాన ప్రదర్శనను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశంలో పౌర విమానయాన రంగం వేగంగా, గణనీయంగా అభివృద్ధి చెందుతున్నదని వివరించారు. ప్రధానమంత్రి గతిశక్తి కార్యక్రమం ద్వారా 100 బిలియన్ డాలర్లతో విమానయాన రంగంలో మౌలిక వసతులు కల్పిస్తామని వివరించారు. 2024-25 నాటికి దేశంలో ఎయిర్‌పోర్టులు, హెలీపోర్టులు, వాటర్డోమ్స్ సంఖ్యను 220కి పెంచుతామని చెప్పారు. ఏటా 100 కొత్త విమానాలను తేవాలన్నది లక్ష్యమని వెల్లడించారు. దేశంలో ప్రాంతీయ కనెక్టివిటీపై దృష్టి పెట్టామని, పైలట్ల శిక్షణ కోసం కొత్త ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటుచేస్తామని చెప్పారు. కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్, నేపాల్ విమానయానశాఖ మంత్రి ప్రేమ్ బహదూర్, పౌరవిమానయానశాఖ కార్యదర్శి రాజీవ్బన్సల్, వివిధ దేశాల ప్రజాప్రతినిధులు, వివిధ కంపెనీల అధిపతులు పాల్గొన్నారు.