న్యూస్ నెట్వర్క్ (నమస్తే తెలంగాణ), సెప్టెంబర్ 2: తెలంగాణ వరప్రదాయిని అయిన కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ దర్యాప్తును కోరడాన్ని నిరసిస్తూ మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు జరిగాయి. రేవంత్ సర్కార్‌కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ శ్రేణులు రోడ్డెక్కారు. ఎక్కడికక్కడ రాస్తారోకోలు, ధర్నాలు చేపట్టారు. తెలంగాణను ఎడారిగా మార్చడానికి మోదీ, రేవంత్, చంద్రబాబు కుట్ర పన్నుతున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్‌పై చెయ్యి వేస్తే రాష్ట్రం అగ్ని గుండం అవుతుందని హెచ్చరించారు.
సీబీఐకి అప్పగించడం సిగ్గుచేటు: శ్రీనివాస్‌గౌడ్
నాగర్‌కర్నూల్, సెప్టెంబర్ 2: మాజీ సీఎం కేసీఆర్‌ను ఇబ్బంది పెట్టేందుకు కుట్ర జరుగుతున్నదని, ఇందులో భాగమే కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణను ప్రభుత్వం కోరిందని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. మంగళవారం నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి ఇంటి నుంచి అంబేద్కర్ చౌరస్తా వద్దకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలన చేతగాని నేతలు కుట్రలకు తెరలేపుతున్నారని ధ్వజమెత్తారు. ఏదో రకంగా కేసీఆర్‌ను ఇబ్బందిపెట్టాలన్నదే రేవంత్ సర్కార్ ఆలోచన అని విమర్శించారు. ప్రాణాలను సైతం పణంగా పెట్టి తెలంగాణ సాధించుకున్నామని, కాంగ్రెస్ కుట్రలకు భయపడేదిలేదని తెలిపారు.
తెలంగాణను ఏడారి చేసే కుట్ర: సబితా ఇంద్రారెడ్డి
బడంగ్‌పేట ; కేసీఆర్‌పై కక్షతోనే కాళేశ్వరంపై సీబీఐ విచారణను రేవంత్ సర్కార్ కోరిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ మంగళవారం మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని జిల్లెలగూడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి బాలాపూర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ‘ప్రధాని మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు, రేవంత్ కలిసి తెలంగాణను ఏడారిగా మార్చడానికి కుట్ర చేస్తున్నారు. బనకచర్లకు గోదావరి నీళ్లను తరలించుకుపోవడానికి మేడిగడ్డను నిర్వీర్యం చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అద్భుతమని సుప్రీంకోర్టు పేర్కొన్నప్పటికీ రేవంత్ సర్కార్‌కు కోర్టులపై నమ్మకం లేదు. కేంద్ర దర్యాప్తు సంస్థలను రాహుల్‌గాంధీ వ్యతిరేకిస్తుంటే రేవంత్ రెడ్‌కార్పెట్ పర్చుతున్నరు. 3 రోజుల కిందట సురవరం సంస్మరణ సభలో సీబీఐ మోదీ జేబు సంస్థ అని పేర్కొన్న రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు సీబీఐకి స్వాగతం పలుకడం కుట్రకోణాన్ని ప్రతిభింభిస్తున్నది’ అని పేర్కొన్నారు.
నీళ్లకు జేజేలు..నిందలపై నిప్పులు
నీళ్లిచ్చిన కాళేశ్వరంపై కాంగ్రెస్ నేతల నిరాధార ఆరోపణలు, నిందలను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ కార్యకర్తలు, రైతులు రోడ్డెక్కారు. రాజకీయ కక్షతో సీబీఐ దర్యాప్తు కోరిన సర్కారుపై భగ్గుమన్నారు. యాదగిరిగుట్టలో సీఎం రేవంత్ దిష్టిబొమ్మను దహనం చేశారు. కాళేశ్వరం తెచ్చి పోసిన గోదావరి జలాలతో నిండుకుండలా ఉన్న సిద్దిపేట జిల్లా రంగనాయకసాగర్ వద్ద ‘ఇది కాదా కాళేశ్వరం… ఇదే కదా కాళేశ్వరం’ అనే పేరుతో 100 మీటర్ల బ్యానర్‌ను ప్రదర్శించారు.
వనపర్తి టౌన్, సెప్టెంబర్ 2 : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జోలికొస్తే తెలంగాణ అగ్నిగుండంగా మారుతుందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సాధించిన కేసీఆర్ కృష్ణానదిపై పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును నిర్మించి 12లక్షల ఎకరాలకు సాగునీరు, గోదావరి నదిపై రికార్డు స్థాయిలో మూడేండ్లలో కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసి 70 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చి తెలంగాణను సస్యశ్యామలం చేశారని తెలిపారు. అటువంటి మహానాయకుడిపై కమిషన్ వేసి రేవంత్ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారని విమర్శించారు.
కురవి, సెప్టెంబర్ 2: కాళేశ్వరం ప్రాజెక్టును సీబీఐకి అప్పగించడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉన్నదని మాలోత్ కవిత, సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. మంగళవారం మహబూబాబాద్ పట్టణంలోని మెడికల్ కళాశాల హాస్టల్ భవన ప్రారంభోత్సవానికి వెళ్తున్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహా కాన్వాయ్‌ను కవిత, సత్యవతి ఆధ్వర్యంలో అడ్డుకున్నారు. అనంతరం సత్యవతి రాథోడ్, మాలోత్ కవిత మాట్లాడుతూ కాల్వల్లో తుమ్మలు మొలవడమే కాంగ్రెస్ పాలనకు నిదర్శనమన్నారు.
దేవరుప్పుల/తొర్రూరు/కొడకండ్ల, సెప్టెంబర్ 2: కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఎన్ని కుట్రలు చేసినా అంతిమంగా విజేతగా నిలిచేది కేసీఆరేనని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. స్థానిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొనే సీబీఐని తెరపైకి తెచ్చారని చెప్పారు. జనగామ జిల్లా దేవరుప్పుల మండల కేంద్రం, కొడకండ్ల మండల కేంద్రంలోని అమరవీరుల చౌరస్తా వద్ద, మహబూబాబాద్ జిల్లా తొర్రూరు బస్టాండ్ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఆయా కార్యక్రమాల్లో ఎర్రబెల్లి మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్ట్‌తో తెలంగాణ సస్యశ్యామలమైందని చెప్పారు.
ఆదిలాబాద్ (నమస్తే తెలంగాణ), సెప్టెంబర్ 2: బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో సస్యశ్యామలంగా మారిన తెలంగాణను ఎడారిగా మార్చడానికి కాంగ్రెస్, బీజేపీ, తెలుగుదేశం పార్టీలు కుట్రలు చేస్తున్నాయని మాజీ మంత్రి జోగు రామన్న మండిపడ్డారు. ఆదిలాబాద్‌లో నిర్వహించిన ధర్నాలో రామన్న మాట్లాడారు. ఇది బడే భాయ్, చోటా భాయ్ అడుతున్న నాటకమని, దీని వెనుక చంద్రబాబు పాత్ర ఉన్నదని ధ్వజమెత్తారు.
జడ్చర్ల టౌన్, సెప్టెంబర్ 2 : కాంగ్రెస్ కుట్ర రాజకీయాలకు పాల్పడుతున్నదని, కేసీఆర్‌ను బద్నాం చేసేందుకు యత్నిస్తున్నదని మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి మండిపడ్డారు. మంగళవారం మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల తాసీల్దార్ కార్యాలయం వద్ద బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణను ముంచి గోదావరి జలాలను ఆంధ్రాకు తరలించుకుపోయేందుకు చంద్రబాబు, రేవంత్‌రెడ్డి, మోదీ కలసి ఆడుతున్న నాటకంలో భాగమే కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణను సీబీఐకి అప్పగించే నిర్ణయమని పేర్కొన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం ఆరెపల్లి బ్రిడ్జి వద్ద కేసీఆర్ చిత్రపటానికి కాళేశ్వరం జలాలతో అభిషేకం చేస్తున్న బీఆర్ఎస్ నాయకులు
సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా, రాస్తారోకో చేస్తున్న ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, బీఆర్ఎస్ శ్రేణులు
సీబీఐ విచారణ పేరుతో కేసీఆర్‌ను ముట్టుకుంటే తెలంగాణ అగ్నిగుండం అవుతుందని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి హెచ్చరించారు. కాలికి శస్త్ర చికిత్స అనంతరం రెండున్నర నెలల తర్వాత మంగళవారం తొలిసారి జనగామ జిల్లా కేంద్రానికి వచ్చిన పల్లాకు గులాబీశ్రేణులు, అభిమానులు స్వాగతం పలికారు. సాధించుకున్న రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నీరందించాలనే సంకల్పంతో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన బీఆర్ఎస్ అధినేతపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని పల్లా మండిపడ్డారు.
కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుపెట్టుకొని సీబీఐ పేరిట ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని పేర్కొంటూ మంగళవారం తాండూరులో నిరసన వ్యక్తం చేస్తున్న బీఆర్ఎస్ సీనియర్ నేత పంజుగుల శ్రీశైల్‌రెడ్డి తదితరులు
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని ప్రధాన రోడ్డు మార్గంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ర్యాలీ చేపడుతున్న ఎమ్మెల్యే మాణిక్‌రావు