Telangana | మాయమాటలు, అలవికాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలపై సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, నిరసనలు వెల్లువెత్తాయి. పింఛన్లు పెంపు చేయాలంటూ బీడీకార్మికులు, దివ్యాంగులు ధర్నాలు చేశారు. డీఎస్సీ వాయిదావేయాలని, రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. పెండింగ్ వేతనాలు చెల్లించాలంటూ గ్రామ పంచాయతీ కార్మికులు ధర్నా చేశారు. వీరికి బీఆర్ఎస్, బీఆర్ఎస్వీ, సీపీఎం, సీఐటీయూ తదితర నాయకులు మద్దతు తెలిపారు.
వారసత్వ నియామకాలు చేపట్టాలని నిరసన
గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన జీవో 81, 85 ప్రకారం వారసత్వ నియామకాలు చేపట్టాలని వీఆర్ఏలు హనుమకొండ, జనగామ కలెక్టరేట్ల ముందు నిరసన తెలిపారు. ధ్రువీకరణ పత్రాలు ప్రభుత్వానికి సమర్పించి 11నెలలైందని తెలిపారు. వారసులకు నియామక ఉత్తర్వులు ఇచ్చి ఆదుకోవాలని కలెక్టర్లకు వినతిపత్రం అందజేశారు.
వేతనాల కోసం పంచాయతీ కార్మికుల ధర్నా
పెండింగ్‌లో ఉన్న వేతనాలను చెల్లించాలని డిమాండ్ చేస్తూ పంచాయతీ కార్మికులు సోమవారం నిజామాబాద్ జిల్లా నవీపేట ఎంపీడీవో కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. వేతనాలు చెల్లించే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అనంతరం వినతిపత్రాన్ని ఎంపీడీవో నాగనాథ్‌కు అందజేశారు.
పింఛన్ పెంచాలని బీడీ కార్మికుల ఆందోళన
కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం జీవనభృతిని 4 వేలకు పెంచాలని డిమాండ్ చేస్తూ ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో బీడీ కార్మికులు భారీ ర్యాలీ, ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణ మాట్లాడుతూ.. బీడీ పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో ఉన్నదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులను ఆదుకోవాలని కోరారు. -ఖలీల్‌వాడి, జూలై 8
పింఛన్ రాలేదని పెట్రోల్‌తో ప్రజావాణికి దివ్యాంగుడు
జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం అలీంపూర్కు చెందిన పాకాల రమేశ్ 2021లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక కాలు కోల్పోవడంతో సదరంలో 85 శాతం వైకల్యం ఉన్నట్లు మెడికల్ బోర్డు 2022లో సర్టిఫికెట్ ఇచ్చింది. తనకు దివ్యాంగుల పింఛన్ ఇప్పించాలని ఏడాదిగా అర్జీ పెట్టుకున్నాడు. సోమవారం జనగామ కలెక్టరేట్లో ప్రజావాణికి పెట్రోల్ బాటిల్ పెట్టుకొని రమేశ్ రాగా, గమనించిన సిబ్బంది లాక్కొని కలెక్టర్ వద్దకు తీసుకువెళ్లారు. 2022 నుంచి కొత్త పింఛన్లు మంజూరుకాలేదని, ఆదేశాలు వచ్చే వరకు ఆగాలని సముదాయించినా వినకపోవడంతో సఖి సెంటర్‌కు తరలించి కౌన్సెలింగ్ ఇప్పించాలని కలెక్టర్ ఆదేశించారు.
-జనగామ, జూలై 8
హెల్త్ సబ్సెంటర్కు తాళం వేసిన గ్రామస్థులు
హెల్త్ సబ్సెంటర్లో వైద్య సేవలందించడం లేదని సోమవారం మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం కోనంపేటలోని హెల్త్ సబ్ సెంటర్‌కు గ్రామస్థులు తాళం వేసి నిరసన తెలిపారు. అలాగే ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులు లేక, సరైన బోధన అందక విద్యార్థులు ఇతర పాఠశాలల వెళ్తున్నారని తెలిపారు. రూ.15 లక్షల వ్యయంతో చేపట్టిన గ్రామ పంచాయతీ భవన నిర్మాణం పూర్తి కాలేదని, గ్రామానికి సరైన రోడ్డు లేక ఇబ్బందిపడుతున్నామని తెలిపారు. అధికారులకు సమస్యలపై విన్నవించినా పట్టించుకోకపోవడంతో సబ్ సెంటర్‌కు తాళం వేశామని గ్రామస్థుడు రాంటెంకి శ్రీనివాస్ తెలిపారు.
డీఎస్సీ పరీక్ష గడువు పెంచాలి
ఖమ్మం ఎడ్యుకేషన్, జూలై 8: తమ జీవితాలతో చెలగాటం ఆడొద్దంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిరుద్యోగులు డిమాండ్ చేశారు. డీఎస్సీ పరీక్ష కోసం గడువు పెంచాలని కోరారు. ఖమ్మం జిల్లా గ్రంథాలయం ఎదుట నిరుద్యోగులు, పీడీఎస్‌యూ నాయకులు సోమవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. హాస్టల్ వెల్ఫేర్ పరీక్షకు, డీఎస్సీకి మధ్యలో 15 రోజులు మాత్రమే గడువు ఉందని అన్నారు. ఈ క్రమంలో డీఎస్సీకి ప్రిపేర్ అయ్యే అవకాశం ఉండడం లేదని చెప్పారు. డీఎస్సీ అభ్యర్థులకు 45 రోజులు గడువు పెంచాలని డిమాండ్ చేశారు. పీడీఎస్‌యూ నాయకులు, నిరుద్యోగులు ఆజాద్, ప్రేమ్‌సింగ్, వెంకటేశ్, రమేశ్, కొండల్రావు, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
కల్వకుర్తి, జూలై 8: నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తిలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట బీఆర్ఎస్వీ, బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరుద్యోగులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన వందరోజుల్లోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించిన సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన మాటను విస్మరించారని ధ్వజమెత్తారు. 25 వేల పోస్టులతో మెగా డీఎస్సీని ప్రకటించాలని, గురుకులాల్లో ఖాళీగా ఉన్న 2 వేల బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆర్డీవో శ్రీనుకు వినతిపత్రం అందజేశారు.
కోనేరు పూడ్చివేతను నిరసిస్తూ జడ్చర్ల బంద్
జడ్చర్ల/జడ్చర్లటౌన్, జూలై 8: మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీలోని బాదేపల్లి పెద్దగుట్టపై ఉన్న రంగనాయకస్వామి ఆలయం ఎదుట ఉన్న కోనేరు పూడ్చివేతను నిరసిస్తూ సోమవారం చేపట్టిన ‘జడ్చర్ల బంద్’ విజయవంతమైంది. బాదేపల్లి పాతబజార్ ఆంజనేయస్వామి ఆలయం నుంచి పట్టణ ప్రధాన రహదారులపై ధార్మిక సంఘాలు, ఆలయ పరిరక్షణ కమిటీ సభ్యులు, యువకులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం నేతాజీ కూడలిలో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. దుండగులు గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపి కోనేరు పూడ్చివేతకు పాల్పడ్డారని ఆరోపించారు. వారిని అదుపులోకి తీసుకొని శిక్షించాలని డిమాండ్ చేశారు. కోనేరు పూడ్చడం, ఇతర కట్టడాలను కూల్చివేయడం బాధాకరమని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు.
హామీల అమలుకు అంగన్వాడీల ఆందోళన
రిటైర్మెంట్ బెనిఫిట్స్ సహా ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ జిల్లా కేంద్రంలో అంగన్వాడీ టీచర్లు, కార్యకర్తలు సోమవారం ధర్నా నిర్వహించారు. ఉద్యోగ విరమణ, పెన్షన్ సదుపాయం తదితర అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఉద్యోగులను వంచించే విధంగా ఉందని అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు దేవగంగు మండిపడ్డారు. ప్రభుత్వం జీవో నంబర్ 10ని వెనక్కు తీసుకుని కొత్త జీవో జారీ చేయాలని డిమాండ్ చేశారు.
-ఖలీల్‌వాడి, జూలై 8
విధుల నుంచి తొలగించారని అటెండర్ నిరసన
మహబూబాబాద్ రూరల్, జూలై 8: తనను కావాలనే విధుల్లో నుంచి తొలగించారని పశుసంవర్థక శాఖలో ఔట్ సోర్సింగ్ అటెండర్‌గా పనిచేసిన సలుగు శోభన్ సోమవారం కుటుంబసభ్యులతో కలిసి మహబూబాబాద్ కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం కొమ్ములవంచకు చెందిన తాను 2006 నుంచి నెల్లికుదురు మండల పశుసంవర్థక కార్యాలయంలో అటెండర్‌గా పనిచేశానని చెప్పారు. 2020లో లోకల్, నాన్ లోకల్ క్యాటగిరీ చూపి ఉద్యోగం నుంచి తొలగించారని, మళ్లీ రెండు నెలలకే విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వం జీవో జారీ చేసిందని తెలిపారు. మహబూబాబాద్ జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి మాత్రం మూడేళ్లుగా డెయిరీ డిప్లొమా కోర్స్ చదివి ఉండాలని సాకు చూపుతూ విధుల్లోకి తీసుకోవడం లేదని ఆవేదన వెలిబుచ్చారు.