గుమ్మడిదల, ఫిబ్రవరి 25 : ప్యారానగర్ డంపింగ్‌యార్డు ఏర్పాటును వ్యతిరేకిస్తూ 21 రోజులుగా సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం స్పందించకపోవడంపై బాధిత గ్రామాల ప్రజలు, రైతు జేఏసీ నాయకులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం గుమ్మడిదలలో దున్నపోతులతో జాతీయ రహదారిపై ర్యాలీ నిర్వహించి వాటికి వినతి పత్రాన్ని అందజేశారు. అక్కడి నుంచి తహసీల్ కార్యాలయానికి వెళ్లి దున్నపోతులతో వినూత్న నిరసన తెలిపారు.
ప్రభుత్వం మొద్దునిద్ర వీడాలని, మొండిపట్టుదలను వదిలి డంపింగ్ యార్డు ఏర్పాటును విరమించాలని డిమాండ్ చేశారు. డంపింగ్ యార్డును వెంటనే రద్దు చేయాలంటూ సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని సుందరయ్య భవన్లో సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు చుక్క రాములు, నాగేశ్వర్రావు, రాజయ్య, ప్రజాసంఘాల నాయకులు రౌండ్‌టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు.
ఈనెల 27న జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరించాలని సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండల పట్టభద్రులు నిర్ణయించారు. మంగళవారం వారు గుమ్మడిదలలో రైతు జేఏసీ నాయకులతో కలిసి సమావేశమై ఈ మేరకు తీర్మానం చేశారు. డంపింగ్ యార్డు ఏర్పాటును తాము కూడా వ్యతిరేకిస్తున్నట్టు పట్టభద్రులు తెలిపారు.