నమస్తే తెలంగాణ నెట్వర్క్, ఏప్రిల్ 25 : పహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ బీఆర్ఎస్, బీఆర్ఎస్వీ, ముస్లిం సంఘాల ఆధర్వంలో నిరసనలు వెల్లువెత్తాయి. శుక్రవారం నల్లగొండ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు నల్లబ్యాడ్జీలు ధరించి కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి హాజరై మాట్లాడుతూ.. ఉగ్రవాదుల దమనకాండను ప్రతి ఒక్కరూ ఖండించాలని పిలుపునిచ్చారు.
నిర్మల్ జిల్లా భైంసాలో బీఆర్ఎస్ నాయకులు ఉగ్రదాడిలో మృతిచెందిన వారికి కొవ్వొత్తులతో నివాళులర్పించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ముస్లింలు నమాజ్ అనంతరం నల్లబ్యాడ్జీలు ధరించి ర్యాలీలు చేపట్టారు. మహ్మదాబాద్‌లో భారతీయ ఏక్తా ర్యాలీ నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లిలో బీఆర్ఎస్ శ్రేణులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించాయి. కామారెడ్డిలో బీఆర్ఎస్వై కార్యకర్తలు ఉగ్రదాడి అమరులకు నివాళులర్పించారు.