హైదరాబాద్, సెప్టెంబర్ 11(నమస్తే తెలంగాణ) : ‘హైదరాబాద్‌లో ఇందిరమ్మ ఇండ్లు ఎప్పుడిస్తరు..? వెరిఫికేషన్ కూడా పూర్తయింది. ఇంతవరకు ఎటువంటి పురోగతి లేదు.’ అని హైదరాబాద్‌కు చెందిన ఓ దరఖాస్తుదారుడు గృహ నిర్మాణశాఖ మంత్రిని ప్రశ్నించారు. ఊహించని విధంగా ఎదురైన ఈ ప్రశ్నకు అవాక్కయిన మంత్రి పొంగులేటి, ‘హైదరాబాద్‌లో నివాస స్థలాల కొరత కారణంగా కొంత ఆలస్యమైంది..త్వరలోనే ఇండ్లు ఇస్తాం’ అని హామీ ఇచ్చారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల సమస్యలు, సందేహాల నివృత్తి కోసం హైదరాబాద్‌లోని హౌసింగ్ కార్పొరేషన్ కార్యాలయంలో గురువారం ఉదయం అధికారులు టోల్ ఫ్రీ కాల్ సెంటర్‌తోపాటు హెల్ప్ డెస్ను ప్రారంభించారు.
వెంటనే ఇందిరమ్మ ఇండ్ల పథకం లబ్ధిదారులు, బాధితుల నుంచి కాల్స్ ప్రారంభమయ్యాయి. కాగా, మధ్యాహ్నం కాల్ సెంటర్‌ను సందర్శించిన మంత్రి పొంగులేటి, తానే స్వయంగా కొన్ని కాల్స్‌ను అటెండ్ చేశారు. ఈ సందర్భంగా వనపర్తి జిల్లా ఖిల్లా ఘనపూర్ మండలానికి చెందిన ఓ వ్యక్తి ఫోన్‌చేస్తూ, తమ ఇల్లు బేస్మెంట్ పూర్తయిందని, అన్ని వివరాలూ అప్లోడ్ చేసినా బిల్లు రాలేదని చెప్పారు. దీంతో మంత్రి సదరు దరఖాస్తుదారుడి వివరాలు తెలుసుకొని, త్వరలోనే బిల్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఏవైనా ఫిర్యాదులుంటే టోల్‌ఫ్రీ నంబర్ -1800 599 5991కు తెలపాలని ఈ సందర్భం గా మంత్రి కోరారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ): ‘42 శాతం బీసీ రిజర్వేషన్ బిల్లు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నది. ఈ బిల్లుపై గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ బిల్లు ఆమోదం పొందినట్టు వచ్చిన వార్తలు అవాస్తవం. తప్పుడు వార్తలను నమ్మొద్దు’ అని రాజ్‌భవన్ అధికారులు తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటనను విడుదల చేశారు. తెలంగాణ బీసీ రిజర్వేషన్ల బిల్లుపై వచ్చిన వార్తలు అవాస్తవమని పేర్కొన్నారు. వివిధ గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీల్లో విలీనం చేస్తూ జారీచేసిన మెమోతో ఈ గందరగోళం నెలకొన్నదని పేర్కొన్నారు.
గురువారం సాయంత్రం వేళ తెలంగాణలో 42 శాతం బీసీ రిజర్వేషన్లకు లైన్‌క్లియర్ అయిందని, సోషల్ మీడియాలో, కొన్ని టీవీ చానళ్లలో విస్తృత ప్రచారం జరిగింది. పంచాయతీరాజ్, మున్సిపల్ చట్ట సవరణకు గవర్నర్ ఆమోదం తెలిపినట్టు, 50 శాతం రిజర్వేషన్ల సీలింగ్ ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంటున్నట్టు వార్తలు చకర్లు కొట్టాయి. ఈ వార్తలపై స్పందించిన రాజ్‌భవన్ అధికారులు ఇదంతా అవాస్తవమని, ఫేక్ వార్తలు నమ్మొద్దని పేర్కొన్నారు.