నమస్తే నెట్వర్క్, అక్టోబర్ 23: ‘నమస్తే తెలంగాణ’ దినపత్రిక వరంగల్ యూనిట్ కార్యాలయంపై కాంగ్రెస్ గూండాల దాడికి నిరసనగా గురువారం పలు సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగాయి. మహబూబాబాద్ అంబేద్కర్ సెంటర్లో టీయూడబ్ల్యూజే హెచ్ 143, ప్రజాసంఘాల నాయకుల ఆధ్వర్యంలో నిరసన వ్యక్తంచేశారు. టీయూడబ్ల్యూజే హెచ్ 143 జిల్లా కన్వీనర్ మద్దినేని గుట్టయ్య మాట్లాడుతూ.. నిజాలను నిర్భయంగా రాస్తూ సమాజంలోని ప్రజలను చైతన్యం చేస్తున్న పత్రికలపై దాడులు చేయడం హేయమైన చర్య అని ధ్వజమెత్తారు. హనుమకొండలోని కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. హనుమకొండ జిల్లా శాయంపేటలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో బీఆర్ఎస్వీ రాష్ట్ర నేత కొమ్ముల శివ ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసన తెలిపారు.
కాంగ్రెస్‌కు అధికార మదం పట్టుకున్నది. కాంగ్రెస్ ఎమ్మెల్యే అచరులను పంపించి పత్రికా ఆఫీస్‌పై దాడి చేయించడం సిగ్గుచేటు. రేవంత్‌రెడ్డి ప్రజాసంక్షేమాన్ని మరిచారు. నిజాలను వెలికి తీస్తున్న నమస్తే తెలంగాణ ఆఫీస్‌పై కాంగ్రెస్ గూండాలు దాడికి యత్నించడం సరైందికాదు.
– భీమా, ఎల్‌హెచ్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు