గుమ్మడిదల, ఫిబ్రవరి 27 : డంప్‌యార్డు ఏర్పాటును వ్యతిరేకిస్తూ సంగారెడ్డి జిల్లా గుమ్మిడిదలలో జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. గురువారం గుమ్మడిదలలో రైతు జేఏసీ అధ్యక్షుడు చిమ్ముల జైపాల్‌రెడ్డి అధ్యక్షతన 23వ రోజు రిలే నిరాహార దీక్ష కొనసాగింది. పాస్టర్లు పాల్గొని డంప్ యార్డుకు వ్యతిరేకంగా నినాదాలు చేసి, రూ.5 వేల విరాళం అందజేశారు. నల్లవల్లి 23వ రోజున వృద్ధులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు.
కొత్తపల్లిలో 23 రిలే నిరాహార దీక్షలో యువకులు పాల్గొన్నారు. నల్లవల్లిలో మహాశివరాత్రి జాగరణలో భాగంగా దీక్షాశిబిరంలో జవహర్‌నగర్ డంప్‌యార్డు వల్ల అక్కడి ప్రజలు పడుతున్న బాధలు, అనారోగ్య సమస్యలు, పర్యావరణం, భూగర్భజలాల కలుషితం గురించి ప్రొజెక్టర్ ద్వారా స్థానికులు తెలుసుకున్నారు.
డంప్‌యార్డు ఏర్పాటుకు వ్యతిరేకంగా గుమ్మిడిదల మండలంలో పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌కు స్వచ్ఛందంగా దూరంగా ఉన్నారు. గుమ్మడిదల పోలింగ్‌స్టేషన్ నంబర్ 425లో పట్టభద్ర ఓటర్లు 295 మంది ఉన్నారు. వీరిలో కేవలం నాన్‌లోకల్ పట్టభద్రులు ఓటర్లు 42 మంది ఓటు వేశారు. 253 మంది స్థానిక పట్టభద్రులు ఓటు వేయకుండా ప్రభుత్వానికి తమ నిరసన తెలిపారు. గుమ్మిడిదల మండలంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓట్లు 19 ఉండగా, 18 పోలయ్యాయి.