మామిళ్లగూడెం, డిసెంబర్ 1: నివాసాల మధ్య మద్యం దుకాణాలు ఏర్పాటు చేయడంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఖమ్మం నగరంలోని ముస్తఫానగర్‌లో సోమవారం కొత్తగా ఏర్పాటు చేసిన వైన్ షాపు ఎదుట స్థానికులు ఆందోళనకు దిగారు. ఇండ్ల మధ్య మద్యం దుకాణం వద్దంటూ పెద్దపెట్టున నినదించారు. ఇటీవల అధికారులు మద్యం దుకాణాలను లాటరీ ద్వారా కేటాయించగా.. ముస్తఫానగర్ ప్రాంతంలో దుకాణం దక్కించుకున్న వ్యాపారులు దుకాణం నడిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న స్థానికులు ఇండ్ల మధ్య మద్యం దుకాణం ఏర్పాటును వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ కార్పొరేటర్ పల్లా రోజ్లీనా దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన కార్పొరేటర్.. స్థానికులతో కలిసి అక్కడికి వచ్చి నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ నివాసాల మధ్య మ ద్యం దుకాణం ఏర్పాటు చేయడం సరికాదని, వెంటనే మరో ప్రాంతానికి తరలించాలని డిమాండ్ చేశారు. నిత్యం రద్దీగా ఉండే ప్రదేశంలో వైన్‌షాపు ఏర్పాటు చేయడం వల్ల స్థానికులు, పిల్లలు, మహిళలు తీవ్ర ఇబ్బందులకు గురవుతారని, ట్రాఫిక్ సమస్య ఏర్పడే అవకాశం ఉన్నదని తెలిపారు. దుకాణాన్ని ఇక్కడి నుంచి తొలగించే వరకు రోజూ ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. ఆందోళనకు కాంగ్రెస్, టీడీపీ నాయకులు సైతం మద్దతు తెలిపారు. వన్‌టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆందోళనకారులతో చర్చించారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చే స్తామని హామీ ఇవ్వడంతో శాంతించారు.