Pyara Nagar | సంగారెడ్డి, గుమ్మడిదల, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ): సంగారెడ్డి జిల్లాలోని ప్యారానగర్, నల్లివల్లి, కొత్తపల్లి గ్రామాలు మరో లగచర్లను తలపిస్తున్నాయి. డంపింగ్ యార్డ్ పనులను నిలిపివేయాలంటూ ప్రజలు చేస్తున్న పోరాటం ఉధృతమవుతున్నది. ప్రజలు అభ్యంతరం తెలుపుతున్నా ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు. నిర్బంధాలు, ఆంక్షలతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామాల్లో పోలీసుల బలగాలు మోహరించాయి. డంపింగ్ యార్డ్ కోసం 2 రోజుల క్రితం వందల ట్రక్కులు, బుల్డోజర్లు పనులు చేపట్టింది. ముందుగా రోడ్డు, ప్రహారీగోడ ప్రారంభించింది. నల్లవల్లి, ప్యారానగర్ గ్రామాల్లో పోలీసులు 144 సెక్షన్ విధించారు. నల్లవల్లి, మంభాపూర్, కొత్తపల్లి, ప్యారానగర్, గుమ్మడిదల, బొంతపల్లి, దోమడుగు గ్రామాల్లో పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు.
దీంతో ఆ ప్రాంతం ఎమర్జెన్సీ వాతావరణాన్ని తలపిస్తున్నది. శుక్రవారం నల్లవల్లి, ప్యారానగర్ గ్రామాల యువకులు, విద్యార్థులు, మహిళలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. కాంగ్రెస్ సర్కారు ప్రజలను నాశనం చేయడానికే కంకణం కట్టుకుందని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజల ఆందోళనకు బీఆర్ఎస్ నేతలు అండగా నిలుస్తున్నారు. ప్రభుత్వం ప్రజల జీవితాలతో చెలగాటమడవద్దని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావుతో హైదరాబాద్‌లోని శుక్రవారం ఆయన గృహంలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి భేటీ అయ్యారు. డంప్‌యార్డు, ప్రజలు, రైతుల ఇబ్బందులపై చర్చించారు. కోర్టుకు, గ్రీన్‌ట్రిబ్యునల్‌కు వెళ్దామని హరీశ్‌రావు పలు సూచనలు చేసినట్టు సమావేశం తర్వాత సునీతాలక్ష్మారెడ్డి తెలిపారు. హరీశ్‌రావును కలిసిన వారిలో బీఆర్ఎస్ నాయకులు గోవర్ధన్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, సంతోష్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ కుమార్‌గౌడ్ తదితరులు ఉన్నారు.
డంపింగ్ యార్డ్ వస్తే అధోగతే!
జంటనగరాల నుంచి రోజూ 200 నుంచి 300 ట్రక్కుల్లో చెత్తను ప్యారానగర్ డంప్‌యార్డుకు తరలించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచించింది. ఇదే జరిగితే హైదరాబాద్-గుమ్మడిదల రోడ్డు ప్రమాదాలు పెరుగుతాయని, దుర్గంధం వ్యాపించి ప్రజలు ఇబ్బందిపడతారని 10 గ్రామాల ప్రజలు చెప్తున్నారు. ఇప్పటికే బొంతపల్లి, దోమడుగు, మంబాపూర్, అనంతారం పరిధిలోని రసాయన పరిశ్రమల నుంచి వెలువడుతున్న కాలుష్యంతో గుమ్మడిదల ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. డంప్‌యార్డు కూడా ఏర్పాటు చేస్తే అక్కడ నివసించే పరిస్థితులు ఉండవని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
ఇన్ని సమస్యలను దృష్టిలో పెట్టుకుని డంప్‌యార్డు నిర్మాణాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. డంపింగ్ యార్డ్‌ను ఆపేందుకు సహకరించాలని దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అధికారులకు రైతులు వినతి పత్రం సమర్పించారు.
జిల్లా కలెక్టర్, డీఎఫ్‌వోకు వింగ్ కమాండర్ లేఖ
ప్యారానగర్లో డంప్‌యార్డు ఏర్పాటు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని అకాడమీ వింగ్ కమాండర్ శుభమ్ మిశ్రా సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి, జిల్లా అటవీశాఖ అధికారులకు లేఖ రాశారు. డంప్‌యార్డ్ అకాడమీ ఫ్లయింగ్ ఏరియా పరిధిలోకి వస్తుందని చెప్పారు.
జవహర్‌నగర్ చెత్తతో అనేక ఇబ్బందులు
మాది గుమ్మడిదల గ్రామం. జవహర్‌నగర్‌కు 12 కిలోమీటర్ల దూరంలోని దమ్మాయిగూడలో నివసిస్తున్నా. డంపింగ్‌యార్డు వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. తాగునీరు కలుషితం అవుతున్నది. ఈగలు, దోమలతో ఇబ్బంది పడుతున్నాం. ఎలుకలు, పందికొక్కులు వస్తున్నాయి. పిచ్చికుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. మేము పడుతున్న కష్టాలు గుమ్మడిదల మండల ప్రజలు ఇబ్బందులు పడొద్దు. అందరూ కలిసి డంపింగ్‌యార్డు ఏర్పాటుకు వ్యతిరేకించాలి.
-దివ్య, గుమ్మడిదల