హిమాయత్‌నగర్, జూలై 8: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని, లేనిపక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలంగాణ ఆటో రిక్షా డ్రైవర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశం ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం హిమాయత్‌నగర్‌లోని వై జంక్షన్లో రాష్ట్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభు త్వం అధికారం చేపట్టి ఆరు నెలలు దాటి నా ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కంచలేదని ఆరోపించారు. 50 ఏండ్లు నిండిన ఆటో డ్రైవర్లకు పింఛన్లు ఇవ్వడంతో పాటు యాక్సిడెంటల్ బీమా రూ.10 లక్షలకు పెంచాలని కోరారు.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంతో నష్టపోతున్న ఆటో డ్రైవర్లకు ఆటో మీటర్ చార్జీలు పెంచాలని, ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయడంతో పాటు ఏడాదికి రూ.12వేలు ఆర్థిక సాయం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ నగర కార్యదర్శి కమతం యాదగిరి, యూనియన్ నేతలు జంగయ్య, కొమురెల్లి బాబు, ఒమర్‌ఖాన్, లతీఫ్, భిక్షపతి, నర్సిరెడ్డి, అశోక్, భాస్కర్, రవి, దావూద్ పాల్గొన్నారు.
గుడిసెలకు పట్టాలివ్వాలని ధర్నా
ములుగు రూరల్, జూలై 8: తాము వేసుకున్న గుడిసెలకు పట్టాలు ఇచ్చి ఇండ్లు నిర్మించాలని, భూస్వాముల దాడులను ఆపాలని డిమాండ్ చేస్తూ ములుగు కలెక్టరేట్ ఎదుట గుడిసెవాసులు సోమవారం సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ గోవిందరావుపేట మండలం పస్రానాగారం రెవెన్యూ శివారులోని సర్వే నంబర్ 109/ఈ/1లోని పదెకరాల భూమిలో రెండేళ్ల క్రితం పేదలు గుడిసెలు వేసుకున్నారని తెలిపారు.
ఈ భూమిని ఆక్రమించుకోవడం కోసం 60 ఏళ్లుగా ఇద్దరు భూస్వాములు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం, మంత్రి సీతక్క జోక్యం చేసుకొని పేదలకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్ దివాకరను కలిసి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు పొదిళ్ల చిట్టిబాబు, రత్నం రాజేందర్, తీగల ఆదిరెడ్డి, గఫూర్బాషా, రాకేశ్, రత్నం ప్రవీణ్, మల్లారెడ్డి, మురళి, ఉపేంద్ర, రమేశ్, బ్రహ్మచారి, రాజు, రజిత, కవిత, రాజేశ్వరి, శారద, సువర్ణ పాల్గొన్నారు.