హైదరాబాద్, మే 15 (నమస్తే తెలంగాణ) : వీబీజీ రామ్జీ చట్టాన్ని రద్దుచేసి జాతీయ గ్రామీణ ఉపాధిహామీ చట్టాన్ని పునరుద్ధరించే వరకు ఐక్యంగా పోరాడుదామని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తీగల సాగర్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ వెంకట్ రాములు, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భూపాల్ పిలుపునిచ్చారు. శుక్రవారం హైదరాబాద్లో నిర్వహించిన ధర్నాలో వారు మాట్లాడారు. ఉపాధి హామీ చట్టంద్వారా కోట్ల మంది కార్మికులకు పని దొరికి, వలసలు తగ్గాయని పేర్కొన్నారు.
పట్టణ ప్రాంత పేదలకు ఉపాధి పని, పని రోజులను 200కు పెంచాలని, రోజు కూలి రూ.800 ఇవ్వాలని దేశవ్యాప్తంగా ఆందోళన, పోరాటాలు ఉధృతమవుతున్న తరుణంలో బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి, ఆ స్థానంలో వీబీజీ రామ్జీ చట్టాన్ని తెచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆధార్ కార్డు , జాబ్ కార్డు , బ్యాంకు అకౌంటు నంబర్ల లింకు పేరుతో లక్షల మంది జాబ్ కార్డులను తొలగించారని వెల్లడించారు. కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లికార్జున్, ఈశ్వర్రావు, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బొప్పని పద్మ, సీఐటీయూ హైదరాబాద్ సెంట్రల్ అధ్యక్ష కార్యదర్శులు దశరథ్ కుమారస్వామి పాల్గొన్నారు.