భద్రాచలం, ఫిబ్రవరి 13 : భద్రాచలం(Bhadrachalam) సీతారామచంద్రస్వామి దేవస్థానం ఈవో( executive officer) ఎల్.రమాదేవిని(Ramadevi) ప్రభుత్వం కీసర ఆర్డీవోగా బదిలీ(Transfer) చేసిందని, వెంటనే ఆమె బదిలీని నిలిపివేయాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు స్థానిక అంబేద్కర్ సెంటర్లో ప్ల కార్డులు చేబూని మంగళవారం నిరసన చేపట్టారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకుడు ఆకోజు సునీల్ మాట్లాడుతూ సరిగ్గా ఏడాది క్రితం ఆలయ ఈవోగా బాధ్యతలు చేపట్టిన రమాదేవి ఆలయ అభివృద్ధిపై దృష్టి సారించారన్నారు. పురుషోత్తపట్నంలో ఆలయానికి సంబంధించిన వేలాది ఎకరాల భూముల్లో శాశ్వత కట్టడాలను తొలగించి కాపాడారన్నారు. అటువంటి అధికారిని బదిలీ చేయకుండా ఇక్కడే కొనసాగించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
అలాగే దేవస్థానం ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈవో రమాదేవి బదిలీని నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ నల్లబ్యాడ్జీలు ధరించి ఆలయ అర్చకులు, ఉద్యోగులు, సిబ్బంది నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు భీమవరపు వెంకటరెడ్డి, కోలా రాజు, పామరాజు తిరుమలరావు, మల్లెల లోకేశ్, దాసరి శేఖర్, రామోజు రాముడు తదితరులు పాల్గొన్నారు.