మక్తల్, నవంబర్ 7 : నారాయణపేట జిల్లా మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి ముంపు గ్రామాల ప్రజల నుంచి నిరసన సెగ తగిలింది. మక్తల్ మండలంలోని సంగంబండ, భూత్పూర్ రిజర్వాయర్లలో గురువారం ఉచిత చేపపిల్లలను ఎమ్మెల్యే వదిలారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను పలువురు నిలదీశారు.
చిట్టెం నర్సిరెడ్డి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (సంగంబండ)లో సర్వస్వం కోల్పోయి ముంపునకు గురైన సంగంబండ, కొత్త గార్లపల్లి గ్రామాలకు చెందిన 110 కుటుంబాలను చేపలు పట్టనీయకుండా రోడ్డున పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో ఏండ్లుగా రిజర్వాయర్లో చేపలు పడుతున్నామని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తమ పొట్ట కొట్టే ప్రయత్నం చేస్తున్నదని మండిపడ్డారు. తమ బతుకులకు అడ్డు రావొద్దని సూచించారు. ఇందుకు ఎమ్మెల్యే స్పందిస్తూ 110 కుటుంబాల సమస్యను పరిషరిస్తామని హామీ ఇచ్చారు.