దళితబంధు పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు రేవంత్ సర్కారు కుట్రలు చేస్తున్నదంటూ సోమవారం కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట లబ్ధిదారులు ఆందోళనకు దిగారు. గత సర్కారు చేయూతతో యూనిట్లు పెట్టుకున్న తాము ఇప్పుడు నడుపుకొనేందుకు అప్పులు చేయాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. ఖాతాలు ఫ్రీజ్ చేయడంతో 5వేల మందికిపైగా లబ్ధ్దిదా రుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని వాపోయారు. ఇప్పటికైనా న్యాయం చేయాలని, లేదంటే ఆత్మహత్యలే శరణ్యమంటూ కన్నీటి పర్యంతమయ్యారు.
– కరీంనగర్ కలెక్టరేట్
ఉపాధి కల్పించాలని నేతకార్మికుల ధర్నా
కాంగ్రెస్ సర్కారు తప్పుడు విధానాల వల్లే మరమగ్గాల పరిశ్రమ తీవ్ర సంక్షోభంలోకి కూరుకు పోయిందంటూ సిరిసిల్లలోని చేనేత జౌళీశాఖ కార్యాలయం ఎదుట ఏఐటీయూసీ చేనేత, పవర్‌లూం కార్మిక సంఘం ఆధ్వర్యంలో కార్మికులు, ఆసాములు సోమవారం ధర్నా చేశారు. లాల్‌బావుటా చేనేత, వపర్లూం కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పంతం రవి మాట్లాడుతూ సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభం వల్ల కార్మికులు ఆకలి చావులు, ఆత్మ హత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
– రాజన్న సిరిసిల్ల, నమస్తే తెలంగాణ
ఇన్నర్ రింగ్ రోడ్డు భూనిర్వాసితుల ధర్నా
ఖిలావరంగల్ ఇన్నర్ రింగ్ రోడ్డు భూనిర్వాసితులు వరంగల్ కలెక్టరేట్ ఎదుట సోమవారం ధర్నా చేశారు. ఐదేండ్లుగా పరిహారం ఇవ్వకుండా 200 ఫీట్ల రోడ్డు పనులు చేపడుతున్నారని ఆరోపించారు. కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ, రెవెన్యూ అధికారులు అవగాహన లేకుండా రేపు, మాపు అంటూ తిప్పుతున్నారని మండిపడ్డారు. ఇప్పటికే పదుల సంఖ్యలో నిర్వాసితు లు మనోవేదనతో చనిపోయినట్టు తెలిపారు. హనుమకొండకు వచ్చిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు వినతి పత్రం ఇచ్చేందుకు ర్యాలీగా వెళ్లారు.
– ఖిలావరంగల్
భూములు కాపాడాలని చెంచుల ఆందోళన
సీఎం రేవంత్‌రెడ్డి ఇలాకా, మంత్రి జూపల్లి నియోజకవర్గంలో చెంచుల భూములు అన్యాక్రాం తమవుతున్నాయని ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండారు రవికుమార్, తోడసం భీమ్రావు ఆరోపించారు. సోమవారం నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ ఆర్డీవో కార్యాలయం ఎదుట చెంచులు వర్షంలోనే ఆందోళన చేపట్టారు. సీపీఎం జిల్లా కార్యదర్శి వర్ధం పర్వతాలు, గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ధర్మనాయక్, రైతు సంఘం రాష్ట్ర నాయకుడు కృష్ణారెడ్డితోపాటు రవి, భీమ్రావు వీరికి మద్దతు తెలిపారు.
– కొల్లాపూర్
‘సీతారామ’ కెనాల్ పనులను అడ్డుకున్న అఖిలపక్షం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వినోభానగర్ సమీపంలో సీతారామ ప్రాజెక్ట్ లింక్ కెనాల్ పనులను సోమవారం అఖిలపక్షం నాయకులు అడ్డుకున్నారు. కేసీఆర్ ప్రభుత్వం చేసిన డిజైన్ ప్రకారం కెనాల్ నిర్మించి జూలూరుపాడు మండలం కాకర్ల, గుండెపుడి, పాపకొల్లుకు నీరందించాలని డిమాండ్ చేశారు.
– జూలూరుపాడు
ఉపాధ్యాయురాలి కోసం ఆందోళన
బదిలీల్లో భాగంగా పాఠశాలకు కేటాయించిన ఉపాధ్యాయురాలు త్వరగా జాయిన్ అయ్యేలా చూడాలని జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం కిష్టాపురం ప్రాథమిక పాఠశాల ఎదుట విద్యార్థులు, తల్లిదండ్రులు సోమవారం ఆందోళన చేపట్టారు. ఇన్చార్జి డీఈవోను వివరణ కోరగా విషయం తన దృష్టికి రాలేదని తెలిపారు.
– అయిజ రూరల్
డిగ్రీ కళాశాల కోసం పోస్టుకార్డు ఉద్యమం
జోగులాంబ గద్వాల జిల్లా అయిజ పట్టణంలో డిగ్రీ కాలేజీతోపాటు వసతి గృహాలను ఏర్పాటు చేయాలని విద్యార్థులు పోస్టుకార్డు ఉద్యమం చేపట్టారు. అయిజ పట్టణంలోని ప్రభుత్వ, హరిహర జూనియర్ కళాశాలల విద్యార్థులతో కలిసి బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి సోమవారం సీఎం రేవంత్‌రెడ్డికి చేరేలా పోస్టుకార్డులను రాయించి పోస్ట్ చేయించారు.
– అయిజ
ఏజెన్సీ డీఎస్సీ కోసం ఐటీడీఏ ముట్టడి
ఏజెన్సీ డీఎస్సీ నిర్వహించాలని తుడుందెబ్బ ఆధ్వర్యంలో సోమవారం ములుగు జిల్లా ఏటూరునాగారంలోని ఐటీడీఏను ముట్టడించారు. తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు వట్టం ఉపేందర్ మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో వంద శాతం రిజర్వేషన్ అమలుతో వెంటనే ఏజెన్సీ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం పీవో చిత్రమిశ్రాకు వినతిపత్రాన్ని అందజేశారు.
– ఏటూరునాగారం