హైదరాబాద్, జూన్ 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్స్ (ఏఈఈ) పోస్టుల తుది ఫలితాలు ప్రకటించాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగులు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గాంధీభవన్‌లో వందల మంది ఏఈఈ అభ్యర్థులు మంగళవారం ధర్నా చేశారు.
గాంధీభవన్ మెట్లమీద బైఠాయించి ఏఈఈ తుది ఫలితాలు విడుదల చేయాలని, పోస్టింగ్ ఆర్డర్లు కూడా ఇచ్చి, తమకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. కొద్దిసేపు మోకాళ్ల మీద కూర్చొని నిరసన తెలిపారు. ‘వీ వాంట్ జస్టిస్’ అంటూ ఫ్లకార్డులను ప్రదర్శించారు. తమ డిమాండ్లకు గతంలో మద్దతు పలికి ప్రభుత్వంతో పోరాటానికి సంఘీభావం తెలిపిన ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పట్టించుకోవడం లేదని విమర్శించారు.
వెంకట్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మూడు నెలల క్రితమే ఏఈఈ పోస్టుల కోసం సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి చేశారని, ఫలితాలు ప్రకటించకుండా జాప్యం చేస్తున్నారని మండిపడ్డారు. అనంతరం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయాన్ని కూడా ఏఈఈ అభ్యర్థులు ముట్టడించారు. అభ్యర్థులు టీజీపీఎస్సీ గేటు దూకి కార్యాలయం లోపలికి వెళ్లే ప్రయత్నం చేయగా, పోలీసులు అడ్డుకున్నారు. తమకు న్యాయం చేయకపోతే దశలవారీగా నిరసనలు చేపడతామని అభ్యర్థులు హెచ్చరించారు. ధర్నాకు అన్ని జిల్లాలకు చెందిన అభ్యర్థులు స్వచ్ఛందంగా హాజరయ్యారు.
2022లోనే ఏఈఈ నోటిఫికేషన్
రాష్ట్రంలో రోడ్డు భవనాలు, నీటి పారుదలశాఖ, పంచాయతీరాజ్, మిషన్ భగీరథ, పబ్లిక్‌హెల్త్, ట్రైబల్ వెల్ఫేర్ శాఖల్లో ఉన్న ఏఈఈ పోస్టుల భర్తీకి గత బీఆర్ ప్రభుత్వం 2022 సెప్టెంబర్‌లో 1,540 పోస్టులతో భారీ నోటిఫికేషన్ ఇచ్చింది. 2023 జనవరి 22న తొలి పరీక్ష నిర్వహించారు.
ఆన్లైన్ విధానంలో రీఎగ్జామ్ నిరుడు మే 8, 9, 21, 22 తేదీల్లో జరిపారు. ఆగస్టు 7న ఫైనల్ కీ విడుదల చేశారు. సెప్టెంబర్ 20న జనరల్ ర్యాంకింగ్ జాబితా (జీఆర్ఎల్) ప్రకటించారు. ఈ ఏడాది మార్చి 18 నుంచి 23 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేశారు. అప్పటి నుంచి తుది ఫలితాలు ఇవ్వకుండా ప్రభుత్వమే కావాలని జాప్యం చేస్తున్నట్టు బాధిత అభ్యర్థులు ఆరోపించారు.
అభ్యర్థులు ఆందోళన పడకండి: బల్మూరి
కొందరు రాజకీయ లబ్ధి కోసం విద్యార్థులు, నిరుద్యోగులను రెచ్చగొడుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఆరోపించారు. ఏఈఈ అభ్యర్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. ఎలాంటి ఇ బ్బంది ఉన్నా వారు తనను సంప్రందిస్తే సమ స్య పరిష్కారానికి కృషిచేస్తానని చెప్పారు. గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తమ దృష్టికి వచ్చిన సమస్యలను 15 రోజుల్లో పరిష్కరిస్తామని తెలిపారు. ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వంపై పనిగట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నాయని ధ్వజమెత్తారు.
నియామకప్రతాలు ఇవ్వక పోవడం బాధాకరం: హరీశ్
Harishrao
రాష్ట్రంలో ఏఈఈ పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తయినా ప్ర భుత్వం తుది ఫ లితాలు ప్రకటిం చి అపాయింట్మెంట్ లెటర్లు ఇవ్వకపోవడం చాలా బాధాకరమని మా జీ మంత్రి హరీశ్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. గాంధీభవన్ వద్ద నిరసన తెలిపిన ఏఈఈ అభ్యర్థులకు సంఘీభావం ప్రకటించారు. మంత్రులకు, అధికారులకు ఎన్నిసార్లు అభ్యర్థులు విజ్ఞప్తి చేసినా ఫలితం లేకుండా పోయిందని మండిపడ్డారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి నియామక పత్రాలు ఇవ్వాలని ఎక్స్ వేదికగా హరీశ్‌రావు డిమాండ్ చేశారు.