హైదరాబాద్ సిటీబ్యూరో, మే 18 (నమస్తే తెలంగాణ): గుల్జార్‌హౌస్ అగ్నిప్రమాదం, ప్రభుత్వ స్పందనలో నిర్లక్ష్యం, వివిధ శాఖల మధ్య సమన్వయలోపంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్‌కు, కాంగ్రెస్ నేతలకు నిరసనసెగ తగిలింది. ప్రమాదం తర్వాత మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం అధికారులు ఉస్మానియా దవాఖానకు తరలించారు. అక్కడ ఉన్న బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు మంత్రి పొన్నం ప్రభాకర్, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, ఎంపీ అనిల్‌కుమార్‌యాదవ్ వెళ్లారు.
ఈ సందర్భంగా సరారు నిర్లక్ష్యానికి నిండు ప్రాణాలు బలయ్యాయని బాధితుల కుటుంబ సభ్యులు మండిపడ్డారు. సమయానికి అంబులెన్స్ వస్తే మా వాళ్లు బతికేవారు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న వాళ్లను కార్లు, ఆటోలలో దవాఖానలకు తరలించాల్సి వచ్చింది. అలస్యంగా వచ్చిన అంబులెన్స్‌లలో ఆక్సిజన్ లేదు. దీంతో మృతుల సంఖ్య పెరిగింది. మేం రేవంత్‌రెడ్డికి ఓటు వేసి గెలిపించిన పాపానికి మాకు సరైనబుద్ధి చెప్పారు అని మండిపడ్డారు.
ఇది అత్యంత దురదృష్టకరమైన ఘటన అని నగర ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ప్రమాదాలు చెప్పిరావని, ఘటన గురించి తెలిసిన వెంటనే స్పందించామని తెలిపారు. హుటాహుటిన ఘటనాస్థలికి వెళ్లి సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షించినట్టు పేర్కొన్నారు. ఆపద సమయంలో ప్రతిపక్షాలు, మీడియా సంయమనం పాటించాలని, రాజకీయాలు చేయవద్దని హితవు పలికారు.