హైదరాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రవ్యాప్తంగా గ్రామపంచాయతీల్లో అభివృద్ధి పనులు చేసి, బిల్లులు రాక అప్పులపాలైన మాజీ సర్పంచుల సమస్యలు నిరసన జ్వాలలుగా మారాయి. మాజీ సర్పంచుల సంఘం రాష్ట్ర జేఏసీ ఆధ్వర్యంలో సోమవా రం హైదరాబాద్‌లోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం ముట్టడి ఉద్రిక్తంగా మారింది. జేఏసీ నేతలు, మాజీ సర్పంచులు భారీ ర్యా లీగా క్యాంప్ ఆఫీస్ వైపు దూసుకెళ్తుండగా, జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, సర్పంచులకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. పోలీసులు జేఏసీ నేతలను అరెస్టు చేసి మధురానగర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
ఈ సందర్భంగా సర్పంచుల సంఘం జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్యగౌడ్ మాట్లాడుతూ.. గ్రామాల్లో సొంత డబ్బులు పెట్టి, అప్పులు తెచ్చి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశామని పేర్కొన్నారు. తమ పెండింగ్ బిల్లులు చెల్లించాలని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే.. అక్రమ అరెస్టులు చేయడం హేయమని మం డిపడ్డారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం వెంటనే బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అక్రమ అరెస్టులతో తమ ఉద్యమాలను ఆపలేరని స్పష్టంచేశారు. కార్యక్రమం లో రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుంటి మధుసూదన్‌రెడ్డి, కార్యదర్శి కేశబోయిన మల్లయ్య, నాయకులు సంగని సూరయ్య, మోడెం విద్యాసాగర్, రాంపక నాగయ్య, బోట్ల రవీందర్, ఊర రవీందర్రావు తదితరులు పాల్గొన్నారు.