హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కయి కాళేశ్వరం ప్రాజెక్టుపై విషం చిమ్ముతున్నాయని శాసనమండలిలో ప్రతిపక్షనేత మధుసూదనాచారి మండిపడ్డారు. కాంగ్రెస్ సర్కారు నియమించిన ఘోష్ కమిషన్ బూటకమని, సీబీఐ విచారణ నాటకమని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సోమవారం ఉదయం మండలి వాయిదా పడిన తర్వాత మధుసూదనాచారి బీఆర్ఎస్ ఎమ్మెల్సీలతో కలిసి గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపం వద్దకు ర్యాలీగా వెళ్లారు. నల్లబ్యాడ్జీలతో బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం మధుసూదనాచారి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, అధికారంలోకి వస్తామని పగటికలలు కంటున్న బీజేపీ.. లోపాయికారి ఒప్పందం చేసుకొనే కేసీఆర్‌పై బురద జల్లుతున్నాయని ధ్వజమెత్తారు. ఇందులో భాగంగానే కాళేశ్వరంపై సీబీఐ దర్యాప్తును తెరపైకి తెచ్చాయని విమర్శించారు. ఇలాంటి కుట్రలు, కుతంత్రాలకు ఉద్యమ పార్టీ అయిన బీఆర్ఎస్ భయపడబోదని తేల్చిచెప్పారు. కేసీఆర్ రాత్రిరాత్రికి కుర్చీలో కూర్చోలేదని, 14 ఏండ్లు పోరాడి తెలంగాణను సాధించి, పదేండ్లు రాష్ట్రాన్ని జనరంజకంగా పాలించారని గుర్తుచేశారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా రెండు పార్టీల వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగడుతామని స్పష్టంచేశారు. కుట్రలను చట్టపరంగా ఎదుర్కొంటామని, ప్రజాక్షేత్రంలో నిజాయతీని నిరూపించుకుంటామని తేల్చిచెప్పారు.
కేసీఆర్‌పై కక్షతోనే దర్యాప్తు: రమణ
ప్రపంచమే ఆశ్చర్యపోయేలా కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి, తెలంగాణ గొంతు తడిపిన కేసీఆర్‌పై కక్షతోనే కాంగ్రెస్ సర్కారు సీబీఐ దర్యాప్తునకు ఆదేశించిందని ఎమ్మెల్సీ ఎల్ రమణ నిప్పులుచెరిగారు. యూరియా దొరక్క రైతులు, నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగులు, హక్కుల కోసం ఉద్యోగులు ఉద్యమిస్తున్న తరుణంలో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కమిషన్, దర్యాప్తు ముసుగులో డ్రామాలు చేస్తున్నదని దుయ్యబట్టారు.
తొత్తులా మారిన రేవంత్: తక్కెళ్లపల్లి
ప్రధాని నరేంద్రమోదీ, ఏపీ సీఎం చంద్రబాబుకు రేవంత్‌రెడ్డి తొత్తుగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు విమర్శించారు. తెలంగాణను సాధించిన కేసీఆర్‌పై కక్ష సాధిస్తున్నారని ధ్వజమెత్తారు. రేవంత్‌రెడ్డి రిమోట్.. చంద్రబాబు చేతిలో ఉన్నదని, అందుకే ఆయన చెప్పినట్టు తలూపుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్, బీజేపీ కుట్రపూరిత రాజకీయాలను ప్రజాబలంతో ఎదుర్కొంటామని స్పష్టంచేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు తాతామధు, కోటిరెడ్డి, యాదవరెడ్డి, పోచంపల్లి, నవీన్‌కుమార్, నవీన్‌రెడ్డి, శంభీర్‌పూర్ రాజు, వాణిదేవీ పాల్గొన్నారు.