ఉస్మానియా యూనివర్సిటీ, జనవరి 7 : ఉస్మానియా యూనివర్సిటీ అధ్యాపకులకు కెరీర్ అడ్వాన్స్మెంట్ స్కీమ్(సీఏఎస్) ప్రమోషన్లలో జరిగిన అవకతవకలకు వ్యతిరేకంగా ప్రొఫెసర్లు చేస్తున్న నిరసన బుధవారంతో 100వ రోజుకు చేరుకున్నది. మూ డు నెలలుగా అధ్యాపకులు నిరసన తెలుపుతున్నా వర్సిటీ అధికారులు సమస్యను పరిష్కరించేందుకు చొరవ చూపడం లేదు. గత నెలలో ఓయూలో పర్యటించిన సీఎం రేవంత్‌రెడ్డి సైతం వారి సమస్యపై స్పందించలేదు. నిబంధనలు విరుద్ధంగా వ్యవహరిస్తున వైస్ చాన్స్‌లర్‌ను తక్షణమే రీకాల్ చే యాలని డిమాండ్ చేశారు. కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాల ఎదుట బుధవారం మధ్యాహ్న భోజన సమయంలో నల్లబ్యాడ్జీలతో నిరసన వ్యక్తంచేశారు.
ఈ సందర్భంగా ఓయూ టీచర్స్ అసోసియేషన్ (ఔటా) అధ్యక్షుడు ప్రొఫెసర్ మనోహర్ మాట్లాడుతూ.. గత నెలలో ఓయూలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటించి, అధ్యాపకుల ప్రమోషన్లలో జరిగిన అవకతవకలపై స్పందించకపోవడం దారుణమని మండిపడ్డారు. ఓయూ వీసీ ప్రొఫెసర్ కుమార్ అర్హులకు ప్రమోషన్ నిరాకరించి, తన అడుగులకు మడుగులొత్తేవారికే పదవులు, ప్రమోషన్లు వస్తాయని పరోక్షంగా చెబుతున్నారని దుయ్యట్టారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి, ప్రమోషన్లపై నిజనిర్ధారణ కమిటీ వేసి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. నిరసనలో అధ్యాపకులు రాంచందర్, శశికళ, రామకృష్ణాగౌడ్, అరవింద్, రమేశ్, రమేశ్‌బాబు, సుజాత, మాధురి, అపర్ణ తదితరులు పాల్గొన్నారు.