జూలూరుపాడు, మార్చి 16: గత కేసీఆర్ ప్రభుత్వంలో తమ ఇళ్లకు శుద్ధజలాలు అందించిన మిషన్ భగీరథ ట్యాంకును కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదం టూ భద్రాద్రి జిల్లా జూలూరుపాడు మండలం కాకర్ల పంచాయతీ దుబ్బతండావాసులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ట్యాంకునకు నీళ్లు ఎక్కించే పైపులు పగిలి నెలరోజులు దాటుతున్నా ప్రభుత్వం పట్టించుకున్న పాపానపోలేదని ఆరోపిస్తున్నారు.
ఆదివారం తండావాసులంతా కలిసి ఖాళీ బిందెలతో ట్యాంకు పైకి ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. కాలులేని ఓ ది వ్యాంగ యువకుడు కూడా కర్ర సహాయంతో ఒంటికాలితో ట్యాంకుపైకి చేరుకొని నినాదా లు చేయడం తాగునీటి తీవ్రతకు అద్దం పడుతున్నది. వైరా ఎమ్మెల్యే రాందాస్‌నాయక్.. తండావాసులతో ఫోన్లో మాట్లాడి, వేసవిలో తాగునీటి ఎద్దడి రాకుండా చూస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
వాకర్‌తో వెళ్తేనే.. గొంతు తడిసేది..ఈ ఫొటోలోని దివ్యాంగుడి పేరు మాసు మల్లయ్య. ఇతనిది మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం షట్పల్లిలోని ఎస్సీ కాలనీ. స్థానికంగా ఉన్న బోరు బావి పాడైపోవడంతో పాటు మిషన్ భగీరథ నీరు సరఫరా కాక.. ఇదిగో ఇలా నిత్యం వాకర్ సాయంతో వెళ్లి సమీపంలోని వ్యవసాయ పంప్‌సెట్ నుంచి తాగునీరు తెచ్చుకుంటున్నాడు. ఆరు నెలలుగా తాగు నీటికి గోస పడుతున్నామని, తమ సమస్యను పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
– కోటపల్లి