హైదరాబాద్, మార్చి 24 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ఎన్నికల హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు దిగిన ఆశా కార్యకర్తలపై పోలీసులు జులుం ప్రదర్శించారు. సోమవారం రాష్ట్ర నలు మూలల నుంచి వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తలు హైదరాబాద్‌లోని కోఠి డీఎంహెచ్‌వో ఎదుట ఆందోళనకు దిగారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిని పోలీసులు అడ్డుకున్నారు. మహిళలను మగ పోలీసులు తాళ్లతో నెట్టేశారు. బలవంతంగా ఈడ్చుకెళ్లి వ్యాన్లలోకి ఎక్కించి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా పోలీసులను ఆశా కార్యకర్తలు ప్రతిఘటించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఆశ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. తెల్లవారుజామునే ఆశా కార్యకర్తల ఇండ్లలోకి వెళ్లి నిర్బంధించారు. చాలామందిని బలవంతంగా వ్యాన్లలో ఎక్కించి, స్టేషన్లకు తరలించారు.
వేతన హామీని నిలబెట్టుకోవాలి
ధర్నా సందర్భంగా ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర నేతలు మాట్లాడుతూ కాంగ్రెస్ ఎన్నికల హామీ మేరకు రూ.18వేల వేతన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ప్రతినెలా క్రమం తప్పకుండా వేతనాలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. నిత్యం తీవ్రంగా శ్రమిస్తున్న తమ సమస్యలను ప్రభుత్వం పెడచెవిన పెట్టడం బాధాకరమని ఆవేదన వ్యక్తంచేశారు. మంత్రులు, ఉన్న తాధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడంలేదని వాపోయారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమను అక్రమంగా అరెస్ట్ చేయడం దారుణమని విరుచుకుపడ్డారు. ఇప్పటికైనా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని, లేదంటే పెద్దఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.
నిర్బంధమే ఇందిరమ్మ రాజ్యమా?: హరీశ్‌రావు
న్యాయమైన డిమాండ్ల సాధన లక్ష్యంగా ఆందోళనకు దిగిన ఆశా కార్యకర్తలను అరెస్ట్ చేయడం దుర్మార్గమని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. అక్రమంగా అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వేతనాలు పెంచాలని అడగడమే వారు చేసిన నేరమా? ఆశా సోదరీమణులంటే ఎందుకింత విద్వేషం.. నిరంకుశత్వం..? ఇందిరమ్మ రాజ్యంలో మహిళలకు దక్కుతున్న గౌరవం ఇదేనా? అని సోమవారం ఎక్స్ వేదికగా ప్రశ్నాస్త్రాలు సంధించారు. గొంతెత్తిన వారిని అక్రమంగా అరెస్ట్ చేస్తూ కాంగ్రెస్ సర్కారు అప్రజాస్వామిక పాలన సాగిస్తున్నదని నిప్పులు చెరిగారు. ఆశాలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.