మహదేవపూర్(కాటారం),సెప్టెంబర్ 29 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల బీఆర్ఎస్ ఇన్చార్జి జోడు శ్రీనివాస్‌ను పోలీసులు ఆదివారం అర్ధరాత్రి అక్రమంగా అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించడాన్ని ఖండిస్తూ సోమవారం బీఆర్ఎస్ నాయకులు పోలీస్‌స్టేషన్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ రాష్ట్ర యువజన నాయకుడు జక్కు రాకేశ్, మండల యూత్ అధ్యక్షుడు రామిళ్ల కిరణ్, మహాముత్తారం బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మార్క రాము గౌడ్ మాట్లాడుతూ జోడు శ్రీనివాస్ అవినీతి, అక్రమాలపై ప్రశ్నిస్తే పోలీసులు కేసులతో భయభ్రాంతులకు గురిచేశారని మండిపడ్డారు. అక్రమంగా అరెస్ట్ చేసిన జోడు శ్రీనివాస్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
కాటారం సీఐ మద్యం మత్తులో అర్ధరాత్రి నా భర్త జోడు శ్రీనివాస్‌ను విపరీతంగా కొట్టి స్టేషన్‌కు తీసుకువెళ్లారు. పిల్లల ముందు ఇష్టంవచ్చినట్లు కొట్టారు. మా కుటుంబాన్ని తీవ్రంగా అవమానించారు. పోలీసుల తీరు దారుణంగా ఉంది. అక్రమంగా అరెస్ట్ చేసిన నా భర్తను వెంటనే విడుదల చేయాలి.
– జోడు శ్రీనివాస్ భార్య రమ్య